Pawan Kalyan Speech: ఐదు సంవత్సరాలకు ఓ సారి ఎన్నికలు ఉండాలి తప్ప, ఐదేళ్ల పాటు ఎన్నికలు జరగడం సరికాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి ఉందని అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల ప్రయోజనాలే ముఖ్యం అనుకుంటే ఆర్టికల్ 370 రద్దు, త్రిపుల్ తలాక్ లాంటివి కీలక నిర్ణయాలు తీసుకునేవారు కాదని అన్నారు. రామమందిరం నిర్మించగలిగేవారు కాదని అన్నారు. దేశ ప్రయోజనాలే మోదీని నిర్దేశిస్తాయి కానీ, ఎన్నికల ప్రయోజనాలు కాదని అన్నారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సభకు ప్రధాని మోదీ కూడా హాజరు కాగా, ఆయనపై ప్రశంసలు కురిపించారు.
మోదీ అధికారంలోకి వచ్చాకే ఉగ్రదాడులు నియంత్రించగలిగారని అన్నారు. ప్రతి భారతీయుడి గుండెల్లో ప్రధాని మోదీ ధైర్యం నింపారని కొనియాడారు. దేశంలో ఉన్న అత్యధిక జనాభా బీసీలు. మోదీ ప్రభుత్వం బీసీలను నోటితో చెప్పి ప్రేమించలేదని, సీటుతో ఇచ్చి ప్రేమించిందని అన్నారు. మాటలతో కాకుండా, బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి ప్రేమించిందని అన్నారు.
‘‘ప్రధాని మోదీ ఎప్పుడూ దేశ ప్రయోజనాల కోసమే పనిచేస్తారు తప్ప.. ఎన్నికల ప్రయోజనాల కోసం కాదు. మోదీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే ఆర్టికల్ 370, నోట్ల రద్దు చేసేవారు కాదు. తెలంగాణ సాధించినా నీళ్లు, నిధులు, నియామకాలు అందని పరిస్థితి. మోదీ నాయత్వంలో బీసీల తెలంగాణ రావాలి. నాలాంటి కోట్ల మంది కలలకు ప్రతిరూపమే నరేంద్ర మోదీ. నరేంద్ర మోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా తీర్చిదిద్దగలిగే సత్తా ఉన్న నాయకుడు మోదీ’’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
‘‘భాగవతం పుట్టిన నేల ఇది. ఈ నేలలో బతుకు భారం అవ్వకూడదు. మోదీ నాయకత్వంలో బీసీలు తెలంగాణలో ఎదగాలి. బీసీలు ముఖ్యమంత్రి కావాలి. దీనికి జనసేన సంపూర్ణ మద్దతు ఉంటుంది. విజన్ 2047 లో భాగంగా ప్రపంచంలోనే భారత్ అగ్రగామి దేశం కావాలంటే.. మూడోసారి మోదీ సర్కార్ రావాలి. ఈ ఎన్నికల కోసం ప్రధాన మంత్రికి నేను అండగా ఉంటాను. తమ పార్టీతో కలిసి పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చినందుకు తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, కె.లక్ష్మణ్, బండి సంజయ్ కు ధన్యవాదాలు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేనూ మీలా సామాన్యుడిలాగే ఆయన ప్రసంగాలు వినేవాడిని. ఇలాంటి వ్యక్తి ప్రధాని అయితే బాగుంటుందని అనుకునేవాడిని. మోదీ నాకెంతో ఇష్టమైన నాయకుడు. నా అన్న. నా పెద్దన్న లాగా నాకు ధైర్యం ఇచ్చి, రాజకీయాల్లో భుజం తట్టిన నాయకుడు మోదీ. ఇలాంటి వ్యక్తి పక్కన కూర్చునే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అని పవన్ కల్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు.