హైదరాబాద్‌లో వ్యాపారం చేయాలంటే పోలీసు లైసెన్స్ తీసుకోవాల్సిందేనంటున్న అధికారులు. వరుస ప్రమాదాలతో అప్రమత్తమైన అధికారులు ఇకపై లెసెన్స్ విధానాన్ని తీసుకొచ్చారు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఆపేసిన లైసెన్స్ విధానాన్ని మళ్లీ పునరుద్ధరించారు. ఇకపై ఎలాంటి వ్యాపారం చేయాలన్నా పోలీస్, ఫైర్‌, ఫుడ్ సేఫ్టీ అధికారుల నుంచి అనుమతి తప్పనిసరి చేశారు. 


ఇటీవలే సికింద్రాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. మినిస్టర్‌ రోడ్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవదహనం అయ్యారు. అంతే కాకుండా మంటలు ఆర్పేందుకు పదుల సంఖ్యలో అధికారులు 18 గంటలు శ్రమించాల్సి వచ్చింది. మంటల ధాటికి బిల్డింగ్‌ పూర్తిగా దెబ్బతింది. అంతే కాకుండా పక్కనే ఉన్న భవనాలపై కూడా ఆ ప్రభావం పడింది. ఆ ప్రాంతంలో జనాలు భయంతో వణికిపోయారు. రెండు రోజుల పాటు ఆ ఏరియాలో జన సంచారాన్ని పూర్తిగా నియంత్రించారు.


అగ్ని ప్రమాదం ధాటికి దెబ్బతిన్న బిల్డింగ్‌ ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పటికీ ఆ ఏరియాలో జనం టెన్షన్ పడుతున్నారు. కూల్చాలో వద్దనే అంశంపా అధికారులు కూడా దీనిపై ఇంతవరకు ఏం తేల్చలేదు. దీంతో ఎప్పుడు ఏం జరగబోతుందనే భయం అందరిలో కనిపిస్తోంది. దీనికి తోడు ఆచూకీ లభించకుండా పోయిన ముగ్గురు వ్యక్తుల ఆచూకి ఇంత వరకు కనుగోలేకపోయారు. వాళ్లు వాడిని సెల్‌ఫోన్‌ లోకేషన్‌ ను ట్రేస్ చేయగా మంటలు చెలరేగిన భవనంలోనే ఉన్నట్లు చూపించింది. ముగ్గురు చనిపోయి ఉంటారని అంతా భావిస్తున్నారు. 


గతంలో కూడా ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. అప్పుడు కూడా అధికార యంత్రాంగం పరుగులు పెట్టాల్సి వచ్చింది. అనేక విమర్సలు ఎదుర్కోకోవాల్సి వచ్చింది. దీంతో అధికారులు రూల్‌ కర్ర బయటకు తీశారు. ఇకపై వ్యాపారాలు చేయాలంటే మాత్రం ట్రేడ్‌ లైసెన్స్ ఉంటే సరిపోదని... పోలీసుల అనుమతి కూడా కావాల్సి ఉంటుందని తేల్చి చెబుతున్నారు. 


వ్యాపారాలు చేయాలంటే ట్రేడ్‌ లైసెన్స్‌తోపాటు పోలీస్‌, ఫైర్‌, ఫుడ్‌ సేఫ్టీ అధికారుల అనుమతి అవసరం ఉండేది. కానీ 2014 తర్వాత ఈ రూల్స్‌లో కాస్త సడలింపు ఇచ్చారు. చిన్న చిన్న వ్యాపారులకు దీని నుంచి మినహాయింపు ఇచ్చారు. వరసు ప్రమాదాలతో అప్రమత్తమైన అధికారులు రూల్స్‌ను కఠినతరం చేశారు. ఇకపై హైదరాబాద్‌లో ఎలాంటి వ్యాపారం చేయాలన్నా కచ్చితంగా రూల్స్ పాటించాలని లేకుంటే అనుమతులు రావని చెబుతున్నారు. 


వరుస ప్రమాదాలతో పోలీసులపై తీవ్ర ఒత్తిడి వస్తోంది. అన్ని వర్గాల నుంచి అధికారులు విమర్సలు ఎదుర్కొంటున్నారు. వీటన్నంటినీకి రూల్స్‌ను కఠినంగా అమలు చేస్తేనే బ్రేక్ పడుతుందని భావించిన పోలీసులు వ్యాపారులు చేయాలంటే మాత్రం కచ్చితంగా మూడు విభాగాల నుంచి అనుమతి తీసుకోవాలని సూచిస్తున్నారు. 


సికింద్రాబాద్‌లో జరిగిన ప్రమాదం తర్వాత అనేక అనుమానాలు వచ్చాయి.  ప్రమాదం జరిగిన తర్వాత అధికారులు  ఆ భవనాన్ని పరిశీలించి.. భవనం అనుమతుల ప్రకారం నిర్మాణం జరిగినట్లు లేదని పేర్కొన్నారు. నిపుణుల సహాయంతో బిల్డింగ్ పరిస్థితి పై సాంకేతిక పరికరాలతో పరిశీలించి నిర్ణయం తీసుకోవాలసిన అవసరముందని అన్నారు.. భవనం కూల్చివేత సమయంలో కూడా నిర్మాణం చేసెప్పటికంటే కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముందని వెల్లడించారు.