Pawan Kalyan Fand dies : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. పవన్ కాన్వాయ్ ను ఫాలో అయిన యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో ఓ యువకుడి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు చేయించేందుకు కొండగట్టు వచ్చిన పవన్ కళ్యాణ్, అనంతరం ధర్మపురి వెళ్లారు. నేటి తన పర్యటన పూర్తి చేసుకున్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. కొందరు యువకులు పవన్ కాన్వాయ్ ను ఫాలో అయ్యారు. ఈ క్రమంలో తమ అభిమాన నేత పవన్ కు అభివాదం చేస్తుండగా రెండు బైకులు ఢీకొనడంతో నలుగురు యువకులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలో ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తలకు తీవ్ర గాయం కావడంతో దుర్మరణం చెందాడు. మరో ముగ్గురు యువకులకు గాయాలు కాగా, వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు
కొండగట్టుకు వెళ్లిన పవన్ కళ్యాణ్, అనంతరం ధర్మపురిని దర్శించుకున్నారు. పర్యటన ముగించుకుని హైదరాబాద్ వెళ్తుండగా కొందరు యువకులు బైకులపై పవన్ కాన్వాయ్ ను వెంబడించారు. ఈ క్రమంలో రెండు బైకులు ఢీకొనడంతో విషాదం నెలకొంది. ఓ యువకుడు చనిపోగా, స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని ధర్మపురి ఆస్పత్రికి పోలీసులు తరలించారు. బైకు మీద నుంచి రోడ్డుపై పడటంతో తల పగిలి పోయి తీవ్ర రక్తస్రావంతో యువకుడు దుర్మరణం చెందాడు.
కొండగట్టులో వారాహికి ప్రత్యేక పూజలు
పార్టీ ప్రచార రథం వారాహి వెహికల్‌కు ప్రత్యేక పూజలు చేసిన ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో పొత్తు కొనసాగుతుందన్న ఆయన... కొన్ని అంశాల్లో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్ణయాలు తీసుకుంటందన్నారు. టీడీపీతో కలవబోమని బీజేపీ అంటోందన్న ప్రచారంపై కూడా ఇలానే స్పందించారు పవన్. తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ పాత్ర ఏంటనేది కాలమే చెప్పాలన్నారు పవన్ కల్యాణ్. తమ పరిమితి ప్రజలు నిర్ణయించాలన్నారు. తమ శక్తి మేరకు తెలంగాణలో గొంతును వినిపిస్తామన్నారు. తెలంగాణలో కొత్త వారు కలిసి వస్తే కొత్తగా ఎన్నికల్లోకి వెళ్తామన్నారు. ఎవరూ రాకుంటే ఒంటరిగానే ఎన్నికలను ఎదుర్కొంటామని కామెంట్ చేశారు. ఏపీలోనే సొంతంగా పోటీ చేసేందుకు సిద్ధంగా పవన్ తెలంగాణలో ఎవరూ కలిసి రాకపోతే సొంతంగా బరిలోకి దిగుతామని చెప్పడం హాట్ టాపిక్ అయింది. కనీసం 10 మందిని అయినా అసెంబ్లీకి పంపించాలంటూ పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
బీఆర్‌ఎస్ ఏర్పాటును స్వాగతించిన పవన్ కల్యాణ్... మార్పు ఆహ్వానించదగిందే అన్నారు. తమ పార్టీ నేతలు బీఆర్‌ఎస్‌లోకి వెళ్లడాన్ని కూడా పవన్ లైట్ తీసుకున్నారు. కొందరు నాయకులు మార్పు కోరుకుంటారని అలాంటి వాళ్లు పార్టీ మారడం సహజమని కామెంట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పాలనాపరమైన నిర్ణయాలు కఠినంగా తీసుకుంటే తప్ప దావోస్‌లాంటి పర్యటనలు ప్రయోజనాలు ఇవ్వబోమన్నారు పవన్. గతంలో ఏపీ ప్రభుత్వ నేతలు వెళ్లిన తర్వాత.. ఆ ఊపును కంటిన్యూ చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు.