Minister KTR : మంత్రి కేటీఆర్ మరోసారి బీజేపీ నేతలకు సవాల్ విసిరారు. నారాయ‌ణ‌పేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగ‌తి నివేద‌న స‌భ‌లో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ కార్పొరేట్లకు రూ. 12 ల‌క్షల కోట్ల రుణాలు మాఫీ చేశారని ఆరోపించారు. తాను చెప్పింది అబ‌ద్ధమ‌ని నిరూపిస్తే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని కేటీఆర్ స‌వాల్ విసిరారు. అది వాస్తవ‌మైతే బీజేపీ నాయ‌కులు స‌మాధానం చెప్పాల‌ని కేటీఆర్ డిమాండ్ చేశారు. అభివృద్ధి ప‌నుల‌తో తెలంగాణ ప్రజలు నాగ‌రికం వైపు పోతుంటే బీజేపీ నాయ‌కులు మాత్రం అనాగ‌రికం వైపు వెళ్తున్నార‌ని కేటీఆర్ ఆరోపించారు. కులాలు, మ‌తాల మ‌ధ్య చిచ్చు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేసిండని అంటున్నారని, తాను చెప్పేది త‌ప్పు అయితే వాళ్లు వేసే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు. స్వాతంత్య్రం వచ్చాక దేశానికి  14 మంది ప్రధానులు ప‌ని చేశారని తెలిపారు. వారంతా రూ. 56 ల‌క్షల కోట్లు అప్పుచేస్తే మోదీ ప్రధాని అయ్యాక రూ. 100 ల‌క్షల కోట్లు అప్పు చేశారన్నారు.  దేశంలో పుట్టే ప్రతి బిడ్డ మీద రూ. ల‌క్షా 25 వేల అప్పు ఉందన్నారు. పెట్రోల్, డీజిల్ మీద అద‌నంగా సెస్సులు వేసి రూ. 30 ల‌క్షల కోట్లను మోదీ వ‌సూలు చేశారని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 






రైతులపై ఆదాయపు పన్ను వేసే ఆలోచన కేంద్రం 


ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజ‌ల నోట్లో కేంద్రం మ‌ట్టి కొడుతుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. పాల‌మూరు ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మోదీని ఎంపీగా పోటీ చేయాల‌ని బీజేపీ నాయ‌కులు కోరుతున్నారని, మోదీ అస‌లు ఏ ముఖం పెట్టుకుని పాల‌మూరులో ఓట్లు అడుగుతారని కేటీఆర్ ఘాటుగా విమర్శించారు. పాల‌మూరు-రంగారెడ్డి ప‌థ‌కానికి మోకాల‌డ్డు పెట్టినందుకు, కృష్ణా జలాల్లో నీటి వాటాలు తేల్చనందుకు మోదీకి ఓట్లు వేయాలా అని మండిపడ్డారు. మోదీ దేవుడు అని ఒకాయ‌న అంటున్నారని, ఆయ‌న ఎవ‌రికి దేవుడు అని కేటీఆర్ నిలదీశారు. సిలిండ‌ర్ రేటు పెంచి క‌ట్టెల పొయ్యి దిక్కు చేసినందుకు ఆడ‌బిడ్డల‌కు మోదీ దేవుడా? అని కేటీఆర్ ప్రశ్నించారు. పెట్రోల్ రేట్ పెంచినందుకు మోదీ దేవుడా అని మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. రైతుల‌పై ఆదాయ‌పు ప‌న్ను విధించేందే యోచనలో కేంద్రం ఉందని కేటీఆర్ ఆరోపించారు. ప్రధాని మోదీ ఆర్థిక స‌ల‌హాదారు విబేక్ దేబ్‌రాయ్ ఓ పత్రికలో వ్యాసం రాశారని, దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు అయిపోయిందని అంటున్నారని తెలిపారు. డ‌బుల్ ఇంజిన్ పాల‌న‌లో రైతుల ఆదాయం డ‌బుల్ అయిందని, ఇక రైతుల‌పై కూడా ఆదాయ‌పు పన్ను వేయాల‌ని ఆయ‌న రాసుకొచ్చారని తెలియజేశారు. కేంద్రం ఇంత దుర్మార్గపు ఆలోచ‌న చేస్తున్నారని మండిపడ్డారు.  ఆదాయ‌మే లేద‌ని బాధపడుతున్న రైతులపై ఆదాయ‌పు ప‌న్ను వేసేందుకు సిద్ధమవుతున్నారని కేటీఆర్ ఆరోపించారు.