Shubman Gill ODI Record:  అద్భుత ఫాంలో ఉన్న టీమిండియా యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. భారత్- న్యూజిలాండ్ మధ్య ఇండోర్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో సెంచరీ బాదిన గిల్.. పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం రికార్డును సమం చేశాడు. ఇంతకీ ఆ రికార్డేంటంటే...


భారత యువ ఓపెనర్ శుభ్ మన్ గిల్ కొత్త ఏడాదిలో అద్భుత ఫాంతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న 3 వన్డేల సిరీస్ లో గిల్ ఒక డబుల్ సెంచరీ, ఒక సెంచరీ బాదాడు. మొదటి వన్డేలో ద్విశతకంతో చెలరేగిన శుభ్ మన్.. మూడో వన్డేలో  సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్ లో 78 బంతుల్లో 112 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో గిల్ పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజాం రికార్డును సమం చేశాడు. 3 మ్యాచ్ ల ద్వైపాక్షిక సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్న బాబర్ ను గిల్ అందుకున్నాడు. కివీస్ తో 3 మ్యాచ్ ల సిరీస్ లో శుభ్ మన్ గిల్ మొత్తం 360 పరుగులు చేశాడు. 2016లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో బాబర్ అజాం కూడా 360 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. 






ధావన్ ను అధిగమించిన గిల్


కివీస్ తో మూడో వన్డేలో సెంచరీ చేసిన శుభ్ మన్ గిల్ మరో రికార్డును కూడా అందుకున్నాను. వన్డేల్లో వేగంగా 4 సెంచరీలు చేసిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ ఘనత భారత వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. ధావన్ 24 ఇన్నింగ్సుల్లో 4 శతకాలు బాదితే.. గిల్ 21 ఇన్నింగ్సుల్లోనే 4 వన్డే సెంచరీలు అందుకున్నాడు. 


ఓపెనర్ల సెంచరీలు


ఇండోర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న మూడో వన్డేలో టీమిండియా ఓపెనర్లిద్దరూ సెంచరీలు బాదారు. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101; 85 బంతుల్లో 9x4, 6x6), శుభ్‌మన్‌ గిల్‌ (112; 78 బంతుల్లో 13x4, 5x6) శతకాలు చేశారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యం అందించారు.  హిట్‌మ్యాన్‌ అత్యంత వేగంగా చేసిన రెండో సెంచరీ ఇదే. గిల్ కు ఈ సిరీస్ లో ఇది రెండో సెంచరీ. మొదటి వన్డేలో గిల్ డబుల్ సెంచరీ అందుకున్నాడు. మొత్తం ఈ సిరీస్ లో 360 పరుగులు చేశాడు.