Rashid Khan Record:  అఫ్ఘనిస్థాన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గా నిలిచాడు. పొట్టి ఫార్మాట్ లో తన కెరీర్ లో రషీద్ ఖాన్ 500 వికెట్లు తీశాడు. 


దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో ప్రిటోరియా క్యాపిటల్స్- ముంబయ్ కేప్ టౌన్ మధ్య జరిగిన మ్యాచ్ లో రషీద్ టీ20 ఫార్మాట్ లో తన 500వ వికెట్ ను సాధించాడు. పొట్టి ఫార్మాట్ లో 500 వికెట్ల మైలురాయిని అందుకున్న రెండో బౌలర్ గా నిలిచాడు. అలాగే ఈ ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్ గానూ అవతరించాడు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో 614 వికెట్లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. 


3 వికెట్లతో చెలరేగిన రషీద్


ఈ మ్యాచ్ కు ముందు అతను 497 వికెట్లతో ఉన్నాడు. ఈ టీ20 లీగ్ లో రషీద్ ముంబై కేప్ టౌన్ కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీయటంతో 500 వికెట్ల క్లబ్ లో చేరాడు. అయితే రషీద్ అద్భుత ప్రదర్శన చేసినప్పటికీ ప్రిటోరియా క్యాపిటల్స్ చేతిలో ముంబై కేప్ టౌన్ 52 పరుగుల తేడాతో ఓడిపోయింది. రషీద్ ఖాన్ 8 ఏళ్ల క్రితం టీ20 క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. 371 మ్యాచుల్లో 368 ఇన్నింగ్స్ ఆడి 500 వికెట్లు తీశాడు. ఈ ఫార్మాట్ లో 17 పరుగులకు 6 వికెట్లు తీయడం రషీద్ అత్యుత్తమ ప్రదర్శన.






టీ20లో అత్యధిక వికెట్ల వీరులు


 టీ20 క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో పేరిట నమోదైంది. 556 మ్యాచ్‌లు ఆడిన బ్రావో 526 ఇన్నింగ్స్‌లలో 614 వికెట్లు పడగొట్టాడు. టీ20 క్రికెట్‌లో అతని అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన 23 పరుగులకు 5 వికెట్లు పడగొట్టడం. రెండో స్థానంలో రషీద్ ఉండగా.. 474 వికెట్లతో  సునీల్ నరైన్ మూడో స్థానంలో ఉన్నాడు. ఇమ్రాన్ తాహిర్ 466, షకీబ్ అల్ హసన్ 436 వికెట్లతో వరుసగా 4, 5 స్థానాల్లో కొనసాగుతున్నారు. 


ముంబయిపై కేప్ టౌన్ విజయం


దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో సోమవారం న్యూలాండ్స్ మైదానంలో ప్రిటోరియా క్యాపిటల్స్- ముంబై కేప్ టౌన్ మధ్య మ్యాచ్ జరిగింది. ముందు బ్యాటింగ్ చేసి ప్రిటోరియా క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 182 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ముంబై కేప్ టౌన్ 18.1 ఓవర్లలో 130 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో 52 పరుగుల తేడాతో ప్రిటోరియా విజయం సాధించింది.