IND vs NZ, 3rd ODI:


భారత్‌, న్యూజిలాండ్‌ మూడో వన్డేకు వేళైంది! కివీస్‌ కెప్టెన్‌ టామ్ లేథమ్ టాస్‌ గెలిచాడు. వెంటనే బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఫ్లడ్‌లైట్ల వెలుతురులో పిచ్‌ బ్యాటింగ్‌కు మరింత అనుకూలిస్తుందని పేర్కొన్నాడు. చివరి రెండు మ్యాచులను మర్చిపోయి మెరుగైన ప్రదర్శన చేయాలన్నాడు. బౌండరీలు చిన్నవిగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదవుతాయని అంచనా వేశాడు. హెన్రీ షిప్లే స్థానంలో డగ్‌ బ్రాస్‌వెల్‌ను తీసుకున్నామని వెల్లడించాడు.


టాస్‌ గెలిస్తే తామెలాగైన బ్యాటింగే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నామని టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అన్నాడు. హోల్కర్‌ స్టేడియం బాగుంటుందని పేర్కొన్నాడు. తాము ఎప్పుడొచ్చినా భారీ స్కోర్లు చేస్తున్నామని గుర్తు చేశాడు. ఇప్పటి వరకు ఆడని వాళ్లకు అవకాశం ఇస్తున్నామని చెప్పాడు. జట్టులో రెండు మార్పులు చేసినట్టు వివరించాడు. షమి, సిరాజ్‌ స్థానాల్లో ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వేంద్ర చాహల్‌ను తీసుకున్నామని వెల్లడించాడు.






తుది జట్లు:


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌


న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, డేవాన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌, డరైల్‌ మిచెల్‌, టామ్‌ లేథమ్, గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకేల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్‌, లాకీ ఫెర్గూసన్‌, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నర్‌






పిచ్‌ రిపోర్ట్‌:


హోల్కర్‌ మైదానం చిన్నది. రెండు వైపులా బౌండరీలు 60-61 మీటర్లు ఉన్నాయి. స్ట్రెయిట్‌గా 69 మీటర్లు, వికెట్ల వెనకాల 54 మీటర్లు ఉంటాయి. బౌలర్లకు నేడు కఠినంగా ఉంటుంది. మంచి లైన్‌ అండ్‌ లెంగ్త్‌తో వేస్తే పేసర్లు వికెట్‌ను ఎంజాయ్‌ చేయొచ్చు. పిచ్‌ మధ్యలో పచ్చిక ఉంది. అక్కడక్కడా నెర్రలు ఉన్నాయి. ఫ్లడ్‌లైట్లు వేశాక బంతి స్కిడ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డానీ మోరిసన్‌, అజిత్‌ అగార్కర్‌ అన్నారు.


భారత్ ఆల్ ఓకే


ప్రస్తుతం టీమిండియా జట్టు అన్ని విభాగాల్లోనూ మెరుగ్గా కనిపిస్తోంది. మొదటి వన్డేలో విజయం కోసం కాస్త కష్టపడ్డప్పటికీ.. రెండో వన్డేలో పూర్తి ఆధిపత్యంతో కివీస్ ను ఓడించింది. భారత టాపార్డర్ ఫుల్ ఫాంలో ఉంది. ముఖ్యంగా ఓపెనర్లు శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మలు మంచి ఫాంలో ఉన్నారు. అయితే శ్రీలంకపై చెలరేగిన కోహ్లీ ఈ సిరీస్ లో తన స్థాయి బ్యాటింగ్ చూపించలేదు. ఇక మిడిలార్డర్ కు ఇప్పటివరకు తన బ్యాటింగ్ పవర్ ను చూపించే అవకాశం రాలేదు. ఒకవేళ టాపార్డర్ విఫలమైతే వారెంత మేరకు రాణిస్తారో చూడాలి. బౌలింగ్ విషయానికొస్తే పేసర్లు, స్పిన్నర్లు సమష్టిగా రాణిస్తున్నారు. సిరాజ్ తన కెరీర్ లోనే అత్యుత్తమ ఫాంలో ఉండగా.. రెండో వన్డేలో షమీ కూడా సత్తాచాటాడు. శార్దూల్, హార్దిక్ లు పర్వాలేదనిపిస్తున్నారు. స్పిన్నర్లు కుల్దీప్, వాషింగ్టన్ సుందర్ ఆకట్టుకుంటున్నారు. ఈ మ్యాచ్ లో టీమిండియా తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది.