Ind-w vs WI-W: దక్షిణాఫ్రికాలో జరుగుతున్న ముక్కోణపు మహిళల టీ20 సిరీస్ లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. నిన్న వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 56 పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 167 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ మహిళల జట్టు 111 పారుగులు మాత్రమే చేయగలిగింది. 74 పరుగులు చేసిన స్మృతి మంధాన విజయంలో కీలక పాత్ర పోషించింది. 


మంధాన హాఫ్ సెంచరీ


దక్షిణాఫ్రికాలోని బఫెలో పార్క్ ఈస్ట్ లండన్ వేదికగా భారత్- వెస్టిండీస్ మ్యాచ్ జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లో 167 పరుగులు చేసింది. ఓపెనర్లు యాస్తిక భాటియా (18), స్మృతి మంధానలు మొదటి వికెట్ కు 33 పరుగులు జోడించారు. ఆ తర్వాత హర్లీన్ డియోల్ (12) త్వరగానే ఔటైనా.. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (56) తో కలిసి స్మృతి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. వీరిద్దరూ ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరును పరుగెత్తించారు. మూడో వికెట్ కు అజేయంగా 115 పరుగులు జోడించారు. దీంతో భారత్ 167 పరుగులు సాధించింది. స్మృతి మంధాన (51 బంతుల్లో 74) అజేయ అర్ధశతకం సాధించింది. 


వెస్టిండీస్ తడబాటు


168 పరుగులు లక్ష్య ఛేదనలో వెస్టిండీస్ తడబడింది. భారత్ బలమైన బౌలింగ్ ముందు విండీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు. వికెట్లు కాపాడుకున్నప్పటికీ వేగంగా పరుగులు చేయలేకపోయారు. దీంతో 20 ఓవర్లలో ఆ జట్టు 4 వికెట్లకు 111 పరుగులు మాత్రమే చేయగలిగింది. క్యాంప్ బెల్లె (47), మాథ్యూస్ (34) రాణించారు. భారత బౌలర్లో దీప్తి శర్మ 2 వికెట్లు తీయగా.. రాజేశ్వరి గైక్వాడ్, రాధా యాదవ్ లు ఒక్కో వికెట్ సాధించారు. స్మృతి మంధాన ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకుంది.