IND vs NZ, 3rd ODI: 


న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో టీమ్‌ఇండియా పరుగుల వరద పారిస్తోంది. 28 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 230 స్కోర్‌ చేసింది. ఓపెనర్లు రోహిత్‌ శర్మ (101; 85 బంతుల్లో 9x4, 6x6), శుభ్‌మన్‌ గిల్‌ (112; 78 బంతుల్లో 13x4, 5x6) సెంచరీలు బాదేశారు. తొలి వికెట్‌కు ఏకంగా 212 పరుగుల భాగస్వామ్యం అందించారు.  హిట్‌మ్యాన్‌ అత్యంత వేగంగా బాదేసిన రెండో సెంచరీ ఇదే. ఇక టీమ్‌ఇండియా తరఫున అతి తక్కువ ఇన్నింగ్సుల్లో నాలుగు వన్డే సెంచరీలు బాదేసిన ధావన్ (24 ఇన్నింగ్సుల్లో) రికార్డును గిల్‌ (21 ఇన్నింగ్సులు) బద్దలు కొట్టేశాడు.




పండగ.. పండగే!


అసలే హోల్కర్‌ స్టేడియం బ్యాటింగ్‌కు స్వర్గధామం! బౌండరీ సైజులూ చిన్నవే! ఇంకేం పరుగుల సునామీ ఖాయమే అనుకున్నారు అభిమానులు. అందుకు తగ్గట్టే టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆరంభించింది. రెండో ఓవర్‌ నుంచే రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ బాదుడు షురూ చేశారు. ఒక ఓవర్లో హిట్‌మ్యాన్‌ కొడితే మరో ఓవర్లో గిల్‌ బౌండరీలు దంచడంతో 7.3 ఓవర్లకే స్కోరు 50 చేరుకుంది. ఓపెనర్లిద్దరూ అదే జోరు కొనసాగించడంతో పది ఓవర్లకే టీమ్‌ఇండియా 82/0తో నిలిచింది.


పోటీపడి బాదేశారు!


ఒక ఎండ్‌ నుంచి హిట్‌మ్యాన్‌ కళ్లుచెదిరే సిక్సర్లు.. మరో ఎండ్‌ నుంచి గిల్‌ అందమైన బౌండరీలు కొట్టడంతో అభిమానులు పండగ చేసుకున్నారు. ఈ క్రమంలో గిల్‌ 33 బంతుల్లో, రోహిత్‌ 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీలు సాధించారు. దాంతో డ్రింక్స్‌ బ్రేక్‌కు టీమ్‌ఇండియా 147 పరుగులతో నిలిచింది. రోహిత్‌ మరింత దూకుడగా ఆడుతూ 83 బంతుల్లోనే సెంచరీ అందుకున్నాడు. అతడికిది వన్డేల్లో రెండో వేగవంతమైన శతకం కావడం ప్రత్యేకం. పైగా కివీస్‌పై రెండోది. తొలి వన్డేలో డబుల్‌ సెంచరీతో ఊపుమీదున్న గిల్‌ సైతం 72 బంతుల్లోనే శతకబాదేశాడు. అయితే సెంచరీ చేసిన వెంటనే 26.1వ బంతికి రోహిత్‌ను బ్రాస్‌వెల్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే సిక్సర్లు బాదుతున్న గిల్‌ను టిక్నర్‌ పెవిలియన్‌ పంపించాడు.


తుది జట్లు:


భారత్‌: రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్‌ కోహ్లీ, ఇషాన్‌ కిషన్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్య, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్‌, ఉమ్రాన్‌ మాలిక్‌


న్యూజిలాండ్‌: ఫిన్‌ అలెన్‌, డేవాన్‌ కాన్వే, హెన్రీ నికోల్స్‌, డరైల్‌ మిచెల్‌, టామ్‌ లేథమ్, గ్లెన్‌ ఫిలిప్స్‌, మైకేల్‌ బ్రాస్‌వెల్‌, మిచెల్‌ శాంట్నర్‌, లాకీ ఫెర్గూసన్‌, జాకబ్‌ డఫీ, బ్లెయిర్‌ టిక్నర్‌