BRS celebrates Deeksha Diwas On November 29: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండో దశ ఉద్యమాన్ని ప్రారంభించిన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు 15 ఏళ్లు పూర్తి అయ్యాయి. రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి వివిధ మార్గాల్లో ఉద్యమ సెగను డిల్లీకి తాకేలా చేసిన కేసీఆర్... ఆఖరి అస్త్రంగా ఆమరణ నిరాహార దీక్షకు సంధించిన రోజు. అందుకే దీన్ని దీక్షా దివస్‌గా బీఆర్‌ఎస్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటుంది.
2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఫలితంగానే నేటి తెలంగాణ సాక్షాత్కారమైందని బీఆర్‌ఎస్ నేతలుు చెబుతున్న మాట. అందుకే దీన్ని ప్రజలంతా వేడుకగా చేసుకోవాలని నాటి ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పల్లె పల్లెలో దీన్ని నిర్వహించాలని ప్లాన్ చేశారు. పార్టీకి చెందిన నేతలను 33 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లుగా నియమించి బాధ్యతలు అప్పగించారు. కరీంనగర్ జిల్లాలో జరిగే కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటే సిద్దిపేటలో హరీశ్ పాల్గొంటారు.
తొలిసారిగా జనంలో కవిత
దీక్షాదివస్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా ప్రజల్లోకి వస్తున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్టై చాలా కాలం జైలులో ఉన్న ఆమె ఇప్పుడు దీక్షాదివస్ పేరుతో జనంలోకి అడుగుపెడుతున్నారు. నిజామాబాద్ జిల్లాలో జరిగే దీక్షా దివస్ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు.
ఓటమి తర్వాత పార్టీలో జోష్ నింపేందుకు మరోసారి తెలంగాణ ఉద్యమ సెంటిమెంట్‌ను గుర్తు చేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. అందుకే నవంబర్ 29 ని అవకాశంగా తీసుకుంది. 14 ఏళ్ల తెలంగాణలో 10 ఏళ్లు తాము చేసిన పనులు గురించి వివరిస్తూనే... ఏడాదిగా కాంగ్రెస్ పాలనలో లోపాలను ఎత్తి చూపడమే ధ్యేయంగా ఈ దీక్షా దివస్ సాగనుంది.
కేటీఆర్ ట్వీట్
ఈ సందర్భంగా కేటీఆర్ కీలక ట్వీట్ చేశారు. తెగువ చూపి తెలంగాణ సాధించిన వీరుడా..అందుకో మా వందనం అంటూ ఓ కవితను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ప్రాణమే ఫణంగా పెట్టి మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదావంటూ కీర్తించారు. తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో అని గర్జించి... ఆమరణ దీక్ష అస్త్రాన్ని సంధించి ఢిల్లీ మెడలు వంచావని చెప్పుకొచ్చారు.
కవిత పిలుపు
కోట్ల మంది ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు.. కేసీఆర్ తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు సిద్దమైన రోజు అంటూ కవిత ట్వీట్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పోరాటంలో చారిత్రాత్మక రోజైన నవంబర్ 29 న కేసీఆర్ పోరాట స్పూర్తిని స్మరించుకుందామని 'దీక్షా దివస్'లో పాల్గొందామని పిలుపునిచ్చారు.
15 ఏళ్ల క్రితం ఇదే రోజు ఏం జరిగింది?
ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను గ్రామ గ్రామానికి వ్యాప్తి చేసిన కేసీఆర్ ఉద్యమాన్ని మరో దశకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాజకీయ పరిస్థితులను గమనించిన ఆయన ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. సిద్దిపేటలోనే దీక్ష చేయబోతున్నట్టు చెప్పడంతో నాటి ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆయన బస చేసిన ప్రాంతంలో పోలీసులు మోహరించారు. ఉద్యమకారులతో కలిసి దీక్షా స్థలికి వెళ్తున్న క్రమంలో కేసీఆర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
అక్కడి నుంచి నాటకీయ పరిణామాల మధ్య కేసీఆర్‌ను ఖమ్మం తరలించారు. అక్కడ కోర్టులో ఆయన్ని హాజరుపరిచి సబ్‌జైలుకు పంపించారు. తాను దీక్ష ప్రారంభించానంటూ కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించకుండా ఖమ్మం ఆసుపత్రికి తరలించారు. అక్కడే ఆయన 11 రోజుల పాటు దీక్ష చేశారు.
కేసీఆర్ అనుకున్నట్టుగానే ఆమరణ దీక్షతో ఢిల్లీ స్పందించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు 2009 డిసెంబర్ 9 అర్థరాత్రి కేంద్రం ప్రకటించింది. దీంతో కేసీఆర్ దీక్షను విరమించారు. అందుకే నవంబర్ 29 అనేది తెలంగాణ ఉద్యమంలో కీలక మలుపుగా బీఆర్‌ఎస్ చెబుతుంది.
Also Read: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ