హైదరాబాద్ దేశంలోనే వందశాతం మురుగునీటి శుద్ధి చేసే తొలి నగరంగా అవతరించబోతోంది. దీనికోసం జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మురుగునీటి శుద్ధి కేంద్రాల పనులు తుదిదశకు చేరుకున్నాయి. నగరంలోని దుర్గంచెరువు, ముళ్లకత్వచెరువు, రెయిన్ బో విస్టా, ఫతేనగర్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న మురుగు నీటిశుద్ధి కేంద్రాలను (ఎస్టీపీ) జలమండలి ఎండీ దానకిశోర్ సందర్శించారు. మొదటి ఎస్టీపీ ట్రయల్ రన్ దశకు చేరుకుంది. ఎస్టీపీల నుంచి దుర్వాసన కట్టడికి టెక్నాలజీ వాడుతున్నారు. సీవరేజీ స్లడ్జ్ ప్రాసెస్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.   


హైదరాబాద్ మహానగరంలో వందశాతం మురుగు నీటిశుద్ధి లక్ష్యంగా జలమండలి ఆధ్వర్యంలో మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో 31 ఎస్టీపీలను నిర్మిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ప్రస్తుతం వీటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 మిలియన్ గ్యాలన్ల మురుగునీరు ఉత్పత్తి అవుతోంది. జీహెచ్ఎంసీ పరిధిలో రోజూ 1650 మిలియన్ గ్యాలన్ల మురుగు నీరు ఉత్పత్తి అవుతుంది. ఈ పరిధిలో ప్రస్తుతం ఉన్న25 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా 772 మిలియన్ గ్యాలన్లు మురుగునీటిని శుద్ధి చేస్తున్నారు. మిగతా 878 మిలియన్ గ్యాలన్ల మురుగు నీటిని శుభ్రంచేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం మొదటిదశలో కొత్తగా 31 ఎస్టీపీల నిర్మాణాలను చేపట్టింది. 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పత్తయ్యే మురుగును శుద్ధి చేసేందుకు వీటిని నిర్మిస్తున్నారు. ఇందులో 971.50 ఎంఎల్డీల సామర్థ్యంగల 15 ఎస్టీపీలను ఈ ఏడాది జూన్ నాటికి పూర్తిచేసి జీహెచ్ఎంసీ పరిధిలో వందశాతం మురుగు నీటిని శుద్ధి చేయనున్నారు. మిగిలిన ప్రాంతాల్లోని ఎస్టీపీలను డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.


దుర్గంచెరువు ఎస్టీపీ (7 ఎంఎల్డీల సామర్థ్యం) వందశాతం పనులు పూర్తి చేసుకుందన్నారు జలమండలి ఎండీ దానకిశోర్. గత 20 రోజులుగా ట్రయల్ రన్స్ కూడా జరుపుతున్నామన్నారు. మిగతా ఎస్టీపీల నిర్మాణ పనులు పూర్తి కావస్తున్నట్లు ఆయన వెల్లడించారు. చాలా ఎస్టీపీల్లో సివిల్ పనులు పూర్తయినట్లు దానకిశోర్ పేర్కొన్నారు. మరికొన్ని వాటిల్లో ఎలక్ట్రో మాగ్నటిక్ పరికరాలు అమర్చడం, ఇతర సామగ్రి, యంత్రాలు, ఇన్ లెట్, అవుట్ లెట్ పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. వాటినీ పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు దానకిశోర్ వివరించారు.


ఎస్టీపీల చుట్టూ నివసించే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడాలనే మంత్రి కేటీఆర్ సూచనలతో దుర్వాసన రాకుండా కట్టడి చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు దానకిశోర్. దీనికోసం విదేశీ సాంకేతికతను వినియోగిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఎస్టీపీల నుంచి వెలువడే వ్యర్థాలను సేంద్రియ ఎరువుల తయారీలో ఉపయోగించే అవకాశం ఉన్నందున, ఈ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేయడానికి ఎస్టీపీల్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు. వీటితో పాటు విశాలమైన ఎస్టీపీల ప్రాంగణాల్లో గార్డెనింగ్, వాకింగ్ ట్రాక్స్‌ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. మూడు షిఫ్టుల్లో పనిచేస్తూ పనులు తొందరగా పూర్తి చేయాలన్నారు. పనులు జరిగే ప్రాంతంలో, కార్మికులు తగిన భద్రతా చర్యలు పాటించేలా చూడాలని ఆదేశించారు.