BRS Leaders Fight : హైదరాబాద్ ఎల్బీ నగర్ లో ఫ్లై ఓవర్ ఓపెనింగ్ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతల వర్గపోరు రచ్చకెక్కింది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి, చంపాపేట్ మాజీ కార్పరేటర్ రమణా రెడ్డికి మధ్య గొడవ జరిగింది. దీంతో ఎమ్మెల్యే అనుచరులు రమణరెడ్డి పైకి దూసుకొచ్చారు. ఆయనపై దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల పుణ్యమా అని అక్కడి నుంచి తప్పించుకున్న రమణారెడ్డి.. బతుకు జీవుడా అంటూ పరుగులు పెట్టారు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఈ తతంగం అంతా మంత్రి కేటీఆర్ సమక్షంలోనే జరగడం గమనార్హం.
కేటీఆర్ సమక్షంలో గొడవ
మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ నేతలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. శనివారం సాయంత్రం మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభించడానికి వెళ్లారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న బీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎల్బీనగర్ ఇన్ ఛార్జ్ రామ్మోహన్ గౌడ్, ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. ఎమ్మెల్యే వర్గీయులు చంపాపేట్ మాజీ కార్పొరేటర్ రమణారెడ్డిని స్టేజీ నుంచి కిందకు దించేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే గొడవ ప్రారంభమైనట్లు సమాచారం. మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న సమయంలోనే నేతలు ఇలా గొడవపడ్డారు. కేటీఆర్ మధ్యలో కలగజేసుకుని వారించారు. అయినా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరులు దాడి చేసేందుకు ప్రయత్నించగా మాజీ కార్పొరేటర్ రమణారెడ్డి పరుగులు తీసి వారి నుంచి తప్పించుకున్నారు.
ఎల్పీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభం
హైదరాబాద్ మణిహారంలో మరో ఫ్లైఓవర్ చేసింది. ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రారంభించారు. వనస్థలిపురం నుంచి దిల్‌సుఖ్‌నగర్ మార్గంలో చేపట్టిన ఈ నూతన వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయి. మొత్తం 760 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు ఉన్న వంతెనను రూ.32 కోట్ల వ్యయంతో మూడు లేన్ల ఫ్లైఓవర్‌గా నిర్మించారు. ఎస్సార్డీపీలో 19వ ప్రాజెక్టుగా ఈ ఫ్లైఓవర్ ను నిర్మించారు. దీంతో ఏపీ నుంచి ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి జిల్లాల నుంచి వచ్చే ప్రజలతో పాటు హయత్‌నగర్ మీదుగా ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రయాణించవచ్చు.
1000 పడకల ఆసుపత్రి
ఎల్బీనగర్ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ నియోజకవర్గంలో 9వ ప్రాజెక్టుగా ఈ పైవంతెనను ప్రారభించామన్నారు. ఎస్సార్డీపీలో చేపట్టిన 12 ప్రాజెక్టులో 9 ఇప్పటికే పూర్తిచేశామన్నారు. గతంలో ఎల్బీనగర్ చౌరస్తా దాటలాంటే చాలా ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్ నిర్మాణాలతో ట్రాఫిక్ కష్టాలు తప్పాయని చెప్పారు. ఎల్బీనగర్ మెట్రో ప్రాజెక్టును నాగోల్ వరకూ పొడిగిస్తామన్నారు. భవిష్యత్తులో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజారోగ్యంపై దృష్టిపెట్టి ఎల్బీనగర్ నియోజకవర్గంలో 1000 పడకల టిమ్స్ గడ్డి అన్నారంలో నిర్మిస్తున్నామన్నారు.
ఎల్బీనగర్ కూడలిలో మరో ఫ్లైఓవర్ ఓపెన్ అయింది. రూ.32 కోట్ల వ్యయంతో ప్రభుత్వం నిర్మించిన హయత్‌నగర్ నుంచి దిల్‌సుఖ్‌నగర్ వైపు వెళ్లే ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీంతో రెండో ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఎల్బీనగర్ కూడలి ఇప్పుడు సిగ్నల్ ఫ్రీగా మారింది. ఓ ఫ్లైఓవర్, 2 అండర్‌పాస్‌లు గతంలోనే అందుబాటులోకి తీసుకొచ్చారు.