MP R Krishnaiah : దేశంలో 36 రాజకీయ పార్టీలుండగా ఒక్క పార్టీ కూడా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టలేదని, ఒకే ఒక్క వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ బీసీ బిల్లు పెట్టి చరిత్ర సృష్టించిందన్నారు ఆ పార్టీ ఎంపీ ఆర్.కృష్ణయ్య. బీసీ బిల్లుకు మద్దతుగా కూడగట్టితే 14 పార్టీలు మద్దతునిచ్చాయని కృష్ణయ్య అన్నారు. దేశంలో ఏ పార్టీ నాయకుడు, ఏ పార్టీ బీసీల పట్లా సానుకూలంగా మాట్లాడకపోవడం అన్యాయం అన్నారాయన. రాజమండ్రిలో శనివారం జరిగిన బీసీ మహాసభ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.


చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు 


పంచాయతీరాజ్‌ రిజర్వేషన్లు కోసం రాజ్యాంగాన్ని సవరించి జనాభా ప్రాతిపదికన ఇవ్వాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి రూ. 2 లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించాలని ఎంపీ ఆర్.కృష్ణయ్య కోరారు. ప్రతీ బీసీ కుటుంబానికి రూ.పది లక్షల సబ్సిడీ రూపంలో రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి పథకాలను, కుల వృత్తుల పథకాలను అధునికీకరించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ లో కేటాయింపులు చేయాలని తీర్మానం చేసినట్లు రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘ జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య తెలిపారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని, పంచాయితీరాజ్‌శాఖలో బీసీ రిజర్వేషన్లను 34 ఉంటే 22కు తగ్గించారని ఆరోపించారు. ఇది దేశంలో ఎవ్వరూ పట్టించుకోవడంలేదని, ప్రధాన రాజకీయ పార్టీలు దీనిపై దృష్టిసారించి బీసీల పక్షాన నిలబడాలన్నారు. కేంద్ర ఫ్రభుత్వం గతంలో వరుసగా పాలించిన కాంగ్రెస్‌, ఎన్డీఏ, బీజేపీ ప్రభుత్వాలు బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చారన్నారు. ఏ పార్టీ, ఏ నాయకుడు కూడా ఈ దేశంలో 56 శాతం ఉన్న బీసీలకు న్యాయం చేయాలని ఆలోచించకపోవడం దారుణమన్నారు. 


ప్రమోషన్లలో రిజర్వేషన్లు పెట్టాలి 


బీసీలు ఈ దేశంలో పుట్టడమే నేరమైందని, ఇట్లాంటి పరిస్థితుల్లో బీసీలు తమ అభివృద్ధి, ఆత్మగౌరవం కోసం న్యాయ పోరాటం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిస్తున్నట్లు కృష్ణయ్య అన్నారు.  ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ,  ఎస్టీలు కేవలం అయిదుశాతం కూడా లేరని, సుప్రీం, హైకోర్టు నియామకాల్లో రెండుశాతం కూడా లేరని, వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు జనాభా ప్రకారం కోట ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లులో రిజర్వేషన్లు పెట్టాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్ల తరువాత ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఐఏఎస్‌, ఎపీఎస్‌, బ్యాంకు ఛైర్మన్లు లేరని, 56 శాతం జనాభా కలిగిన బీసీలకు అన్యాయం జరుగుతుందన్నారు. రాజకీయ రంగంలో 14 శాతం, ఉద్యోగాలలో 9 శాతం, ప్రయివేటు ఉద్యోగాలలో 5 శాతం, ఉన్నత న్యాయవ్యవస్థలో 2 శాతం, కాంట్రాక్టు, వ్యాపార రంగాల్లో ఒక శాతం, పరిశ్రమ రంగంలో ఒక శాతం ఉంటే ఇదెట్లా ప్రజాస్వామ్యం అవుతుందని ప్రశ్నించారు. అన్ని రంగాల్లో జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వారి వారి జనాభా ప్రకారం వాటా లభిస్తేనే సామాజిక న్యాయం అన్నారు. పేదకులాలకు న్యాయం జరగడం లేదన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెట్టేవరకు పోరాటం కొనసాగుతుందని కృష్ణయ్య తెలిపారు. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా కలిసి రావాలన్నారు..


సామాజిక న్యాయం పాటించిన జగన్‌..


ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి 18 మంది ఎమ్మెల్సీలను ప్రకటిస్తే వాటిలో 11 మంది బీసీలకు కేటాయించడం దేశానికే ఆదర్శమన్నారు. గతంలో 40 శాతంకు మించి ఇచ్చింది లేదని, కానీ జనాభా 50 శాతం ఉంటే 60 శాతం సీట్లు ఇచ్చి దేశంలోనే చరిత్ర సృష్టించారన్నారు. విభజన జరిగిన రాష్ట్రంలో కూడా 11 మంది బీసీలకు మంత్రి పదవులిచ్చి చరిత్ర సృష్టించారన్నారు. బీసీల పక్షాన నిలబడిన జగన్‌ను చూసి మిగిలిన రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కూడా చేయాలని అంటున్నారన్నారు. ఏపీలో ప్రభుత్వం రూ.38 వేలకోట్లు బడ్జెట్టు కేటాయించిందని, కేంద్ర ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు సిగ్గుతెచ్చుకోవాలని కృష్ణయ్య అన్నారు.