IPL 2023:
ఇండియన్ ప్రీమియర్ లీగు సరికొత్త సీజన్‌కు ఇంకెన్నో రోజుల్లేదు. మార్చి 31నే తొలి మ్యాచ్. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్, నాలుగుసార్లు విజేత చెన్నై సూపర్ కింగ్స్ తలపడుతున్నాయి. ఎప్పట్లాగే ఈసారీ అన్ని జట్లను గాయాల బెడద వేధిస్తోంది. ఫిట్‌నెస్ సమస్యలు వెంటాడుతున్నాయి. ముంబయి ఇండియన్స్ సహా చాలా జట్లలో కీలక ఆటగాళ్లు లేరు. ఇప్పటి వరకు ఎవర్నీ రీప్లేస్‌మెంట్‌గా భర్తీ చేయలేదు. ఆఖరి నిమిషంలో నిర్ణయాలు తీసుకుంటారా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ప్రసిద్ధ్ ప్లేస్‌లో సందీప్?
గతేడాది రన్నరప్ రాజస్థాన్ రాయల్స్. ఈ జట్టు విజయాలు సాధించడంలో టీమ్‌ఇండియా యువ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణది కీలక పాత్ర. గాయం వల్ల సుదీర్ఘ కాలం నుంచీ అతడు క్రికెట్ ఆడటం లేదు. అతడి స్థానంలో సీనియర్ స్పిన్నర్ సందీప్ శర్మను తీసుకుంటారని తెలిసింది. ఇప్పటికే అతడు ఆర్‌ఆర్ క్యాంపులో ట్రైనింగ్ చేస్తున్నాడని సమాచారం. ఒకవేళ అతడిని తీసుకుంటే మంచి రిప్లేస్‌మెంటే అవుతుంది. ఈ వేలంలో సందీప్‌ను ఎవరూ కొనుగోలు చేయలేదు. విండీస్ పేసర్ ఒబెడ్ మెకాయ్ కూడా ఆడటం లేదు.
రిషభ్‌కు రిప్లేస్‌మెంట్ ఎవరు?
దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషభ్ పంత్ కారు ప్రమాదానికి గురయ్యాడు. ఏడాది వరకు అతడు అందుబాటులో ఉండే అవకాశమే లేదు. దాంతో అతడికి రీప్లేస్‌మెంట్‌గా ఎవరిని తీసుకోవాలో దిల్లీకి అర్థమవ్వడం లేదు. మెంటార్ రికీ పాంటింగ్, డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కలిసి త్వరలోనే ఒకరిని ఎంపిక చేస్తారని తెలిసింది. వికెట్ కీపర్‌గా ఫిల్‌సాల్ట్ ఉన్నా రిషభ్ స్థాయి బ్యాటర్ లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
బుమ్రా, జే ప్లేస్ ఖాళీ!
ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్‌ను ఇంకా కష్టాలు వీడటం లేదు. గతేడాది నుంచీ వారి పేస్ బౌలింగ్ బలహీనంగా మారింది. ట్రెంట్ బౌల్ట్‌ను రాజస్థాన్ తీసుకోవడంతో బుమ్రాకు ఒక్కరూ అండగా నిలవలేదు. ఇప్పుడేమో స్వయంగా అతడే దూరమయ్యాడు. ఆసీస్ స్పిన్నర్ జే రిచర్డ్‌సన్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజూరీతో బాధపడుతున్నాడు. వీరి స్థానాల్లో ముంబయి ఇతరుల్ని తీసుకోవాల్సి ఉంది.
బెయిర్‌స్టోకు నో ఎన్‌వోసీ!
పంజాబ్ కింగ్స్‌కు భారీ షాకే తగిలింది. విధ్వంసకర బ్యాటర్ జానీ బెయిర్‌స్టోకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఎన్‌వోసీ ఇవ్వలేదు. అతడి స్థానాన్ని భర్తీచేసే ఆటగాడిని వెతకడం చాలా కష్టం. కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌కు రిప్లేస్‌మెంట్‌ను వెతకడమూ ఆషామాషీ కాదు. నితీశ్ రాణా కూడా గాయంతో బాధపడుతున్నాడు. కైల్ జేమీసన్ ప్లేస్‌లో చెన్నై సూపర్‌కింగ్స్ సిసందా మగలను తీసుకుంది. కీలకమైన లెఫ్టార్మ్ పేసర్ ముకేశ్ చౌదరీ ఫిట్‌నెస్‌తో లేడు.
మొహిసిన్ దూరం
లక్నో సూపర్‌జెయింట్స్‌లో యంగ్ అండ్ డైనమిక్ పేసర్ మొహిసిన్ ఖాన్ కొన్ని నెలలుగా క్రికెట్టే ఆడటం లేదు. భుజాల్లో అతడికి గాయమైంది. ఈ సీజన్లో చాలా మ్యాచులకు అతడు దూరమవుతాడని తెలిసింది.