Sandhya Theater Stampede Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త సంవత్సరం రోజున ఈ కేసుకు సంబంధించిన రెండు కీలక పరిణామాలు జరిగాయి. ఈ కేసులో జాతీయ మానవహక్కుల కమిషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరోవైపు ఈ కేసులో నిర్మాతలను అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది.
డిసెంబర్ 4న పుష్ప-2 ప్రీ రిలీజ్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో ఓ మహిళ మృతి చెందగా, ఓ బాలుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. దీనిపై జాతీయ మానవహక్కుల కమిషన్‌లో ఓ లాయర్ ఫిర్యాదు చేశారు. పోలీసుల కారణంగానే తొక్కిసలాట జరిగిందని అందులో పేర్కొన్నారు. పోలీసుల లాఠీఛార్జితోనే తొక్కిసలాట చోటు చేసుకుందన్నారు.
దీనిపై స్పందించిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణకు ఆదేశించింది. అనంతరం తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ సీపీకి నోటీసులు అందించింది. నాలుగు వారాల్లో ఘటనపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
మరోవైపు ఇదే కేసులో పుష్ప-2 నిర్మాతలకు ఊరట లభించింది. నిర్మాతలు యలమంచిలి రవిశంకర్, యెర్నేని నవీన్‌ని అరెస్టు చేయొద్దని హైకోర్టు పోలీసులకు ఆదేశించింది. విచారణ చేయవచ్చని పేర్కొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో తమపై వేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని కోర్టులో పిటిష్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కేసు కొట్టేసేందుకు అంగీకరించలేదు. అరెస్టు నుంచి మాత్రం కల్పించింది.