Telangana News: తెలంగాణ ఎక్సైజ్‌శాఖలో న్యూ ఇయర్ జోష్ కనిపించింది. ఈసారి కూడా భారీగా ఆదాయం సమకూరింది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ కొత్త ఏడాదికి స్వాగతం పలికిన ప్రజలు భారీగా మద్యాన్ని విక్రయించారు. డిసెంబర్‌ ఆఖరిలో మద్యం ప్రియులు భారీగానే ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చారు. దాదాపు వందల కోట్ల రూపాయల మద్యాన్ని అమాంతం తాగేశారు. 


డిసెంబర్‌ 28 నుంచి 31 వరకు మద్యం ప్రియులు 926 కోట్ల రూపాయ మద్యం సేవించినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఎక్సైజ్‌ శాఖ అధికారులు వెల్లడించారు వివరాల ప్రకారం చూస్తే... 28వ తేదీన 191 కోట్ల రూపాయలు, 29న 51 కోట్ల రూపాయలు, 30వ తేదీన 402 కోట్ల రూపాయలు, 31వ తేదీన రూ.282 కోట్ల రూపాయల మద్యాన్ని విక్రయించారు. ఈ మూడు రోజులే కాదు డిసెంబర్ నెలంతా ఖజానాకు పండగే అని చెప్పవచ్చు. గతేడాది ఆఖరి నెలలో 4 వేల కోట్ల రూపాయల మద్యం అమ్ముడైంది. 


ఈవెంట్స్‌తో ఆదాయం 


డిసెంబర్‌ 31న నిర్వహించే ఈవెంట్స్‌ వల్ల కూడా ప్రభుత్వానికి ఆదాయం భారీగానే వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా 287 ఈవెంట్లకు అనుమతులు ఇచ్చారు. ఇలా అనుమతు ఇవ్వడంతో రూ.56.46 లక్షల ఆదాయం సమకూరింది. వీటిలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే 243 ఈవెంట్లకు అనుమతులు ఇస్తే... రాష్ట్రవ్యాప్తంగా 44 కార్యక్రమాలకు అనుమతులు ఇచ్చారు. 2023 డిసెంబర్‌లో ఇచ్చిన ఈవెంట్‌లతో రూ.44.76 లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆదాయం పెరిగినట్టు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది.  


రాజధాని ప్రాంతంలో తగ్గుదల 


మద్యం అమ్మకాల్లో మాత్రం రంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాలు టాప్‌లో నిలిచాయి. ఇక్కడ 116కోట్ల రూపాయల విలువైన మద్యాన్ని తాగేశారు. వీటిలో 93,725 లిక్కర్​.. 1,18,447 బీర్​ కేసులు కొనుగోలు చేశారు. అయితే గతేడాదితో పోలిస్తే ఇక్కడ మద్యం అమ్మకాలు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. గతేడాది రూ.117.32 కోట్లు మద్యం అమ్మకాలు జరిగాయి. 


ఆంధ్రప్రదేశ్‌లో అమ్మకాలు 


ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్‌ 31 రోజునే 200 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయం జరిగింది. 60 లక్షల లిక్కర్‌, 18 లక్షల బీర్లను తాగేశారు. ఆఖరి రెండు రోజుల పాటు రూ.331.85 కోట్ల విలువైన మద్యం దుకాణాలకు చేరింది. రెగ్యులర్‌గా రోజుకు రూ.80 కోట్ల మద్యాన్ని డిపోల నుంతి తీసుకెళ్తుంటారు. కొత్త ఏడాది అని ఈసారి రెట్టింపు తీసుకెళ్లారు.