Telangana News: తెలంగాణలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్టల్స్ నిర్వహణపై అనేక విమర్శలు వస్తున్నాయి. ఫుడ్ సరిగా లేదని, నిర్వహణ అధ్వాన్నంగా ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే అప్పుడప్పుడు ఫుడ్‌పాయిజన్ కేసులు వెలుగు చూస్తున్నాయి. పదుల సంఖ్యలో విద్యార్థులు ఆసుపత్రిలో చేరుతున్నారు. విష సర్పాలు కూడా తిరుగుతున్నాయని ఈ మధ్య విమర్శలు వెల్లువెత్తాయి.
ఇన్ని విమర్శలు వస్తున్న వేల తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంత నిధులు వెచ్చిస్తున్న పరిస్థితిలో మార్పు రాకపోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఇస్తున్న డబ్బులు ఏమవుతున్నాయి. విద్యార్థులకు మంచి వసతులు కల్పించడం లోపం ఎక్కడ ఉందనే విషయంపై ఫోకస్ చేసింది.
అందులోభాగంగా అన్ని రకాల ప్రభుత్వ హాస్టళ్ల పర్యవేక్షణ బాధ్యతను అడిషనల్ కలెక్టర్లకు ఇచ్చింది ప్రభుత్వం. గర్ల్స్ హాస్టల్స్‌లో మహిళా ఐఏఎస్ అధికారులు బస చేయాలని ఆదేశించింది. హాస్టల్ నిర్వహణ అధ్వాన్నంగా మారడానికి కారణమేంటి... అక్కడ ఉన్న సమస్యలు ఏంటీ... వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అధికారులు ఇచ్చే నివేదిక ఆధారంగా మరిన్ని పటిష్ట చర్యలు తీసుకోనుంది ప్రభుత్వం.