National Amatuer Golf League:  దేశంలో గోల్ఫ్ కు మరింత ప్రాచుర్యం కల్పించే ఉద్ధేశంతో టీ గోల్ఫ్ ఫౌండేషన్ ప్రారంభించిన నేషనల్ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ రెండో ఎడిషన్ ఈరోజు నుంచి మొదలు కానుంది. గచ్చిబౌలి బౌల్డర్ హిల్స్ వేదికగా 5 రోజుల పాటు జరగనున్న ఈ లీగ్ నవంబర్ 19న ముగియనుంది. 


గత ఏడాది జరిగిన తొలి సీజన్ కు మంచి స్పందన వచ్చింది. ఈ సారి సీజన్ లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమ్ మైసాతో పాటు మైటీ ఈగల్స్ ( బెంగళూరు) , కానమ్ ర్యాప్టర్స్ ( ఛండీఘర్), చెన్నై హస్లర్స్ ( చెన్నై), గోల్ఫర్స్ గిల్డ్ ( ఢిల్లీ ), నానో ఫిక్స్ క్లీన్ టెక్ ( కోల్ కతా), దబాంగ్ డేర్ డెవిల్స్ ( లక్నో ), శ్రీనిధియన్ థండర్ బోల్ట్స్ ( హైదరాబాద్ ) టీమ్స్ ఆడనున్నాయి. 


ఈ లీగ్... సింగిల్స్ మరియు ఫోర్ బాల్ బెటర్ బాల్ మ్యాచ్ ప్లే ఫార్మాట్ లో జరుగుతుంది. మొత్తం 8 జట్లను డ్రా పద్ధతిలో రెండు గ్రూపులుగా విభజించారు. ప్రతీ జట్టూ మిగిలిన జట్లతో ఒక మ్యాచ్ ఆడుతుంది.ఈ రెండు గ్రూపుల్లో టాప్ లో నిలిచిన 2 జట్లు సెమీస్ కు వెళతాయి.  


గోల్ఫర్లకు ఇది చక్కని అవకాశం


ప్రతీ సీజన్ కు ఆటగాళ్ల నుంచి స్పందన పెరగడం సంతోషంగా ఉందని టీ గోల్ఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ ఎన్ ఆర్ ఎన్ రెడ్డి చెప్పారు. గోల్ఫర్లకు కేవలం పోటీతత్వమే కాకుండా స్నేహపూర్వక వాతావరణంలో ఆడేందుకు ఇదొక చక్కని వేదికగా ఉంటుందన్నారు. తాము నిర్వహిస్తున్న ఈ లీగ్ ద్వారా యువ గోల్ఫర్లు మరింత మంది అంతర్జాతీయ స్థాయికి వెళ్ళాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. 


ఈ సీజన్ లో విజేతగా నిలిచిన జట్టుకు రూ. 5 లక్షలతో పాటు నేషనల్ ఛాంపియన్స్ ట్రోఫీ అందజేయనున్నారు. రన్నరప్ కు రూ.  3 లక్షలు , మూడో స్థానంలో నిలిచిన జట్టుకు రూ. 2 లక్షల ప్రైజ్ మనీతో పాటు మెడల్స్ ఇవ్వనున్నారు. అంతర్జాతీయ గోల్ఫర్లు టీసా మాలిక్ ,రిథిమా దిలావరి ముఖ్య అతిథులుగా వచ్చి టీమ్స్ కు శుభాకాంక్షలు చెప్పారు. ఐపీఎల్ తరహాలో  నిర్వహిస్తున్న ఈ అమెచ్యూర్ గోల్ఫ్ లీగ్ కు జాగృతి గ్రూప్ , ట్రిడెంట్ , బ్రెండన్ డిసౌజా మేనేజ్ మెంట్ సర్వీసెస్ సపోర్ట్ అందిస్తున్నాయి.