తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌ను ఆయన ఇంటికి వెళ్లి సీఎం కేసీఆర్ స్వయంగా కలవడంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కేఏ పాల్ స్పందించారు. పాస్‌‌‌‌పోర్ట్‌‌‌‌ కేసులో నిందితుడిగా ఉన్న సీఎం కేసీఆర్‌‌‌‌ తెలంగాణ సీజేను ఎలా కలుస్తారని కేఏ పాల్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కూడా నిందితులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ ఇంకా విచారణ దశలో ఉందని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ చీఫ్ జస్టిస్‌‌‌‌ను కలవడం ఏంటని, దీని వెనుక ఉద్దేశం ఏమై ఉంటుందని కేఏ పాల్ నిలదీశారు. సోమవారం (నవంబరు 14) సోమాజిగూడలోని ప్రెస్ క్లబ్‌‌‌‌లో ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. 


తెలంగాణ హైకోర్టు చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ ఉజ్జల్ భుయన్ ను కలిసిన సీఎం కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు తప్పు చేసినా తాను విడిచిపెట్టబోనని, కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై తాడోపేడో తేల్చుకుంటానని అన్నారు. సీఎం కేసీఆర్‌‌‌‌‌‌‌‌ను గద్దెదింపే వరకు నిద్రపోనని అన్నారు. రాష్ట్రంలో అవినీతి పాలనపై పోరాటం చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.


నాలుగు రోజుల క్రితం భేటీ


నవంబరు 11న తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ను సీఎం కేసీఆర్ కలిశారు. గత శుక్రవారం సాయంత్రం కుందన్ భాగ్ లోని సీజే ఇంటికి నివాసానికి వెళ్లిన సీఎం కేసీఆర్ ఉజ్జల్‌ భుయాన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయినట్లుగా సీఎంవో అధికారులు తెలిపారు. అయితే వీరు ఏ అంశంపై మాట్లాడుకున్నారనే అంశం మాత్రం ఎవరూ చెప్పలేదు. ఇటీవల టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సుప్రీం కోర్టుతో పాటుగా అన్ని రాష్ట్రాల హైకోర్టు చీఫ్ జస్టిస్ లు ఈ అంశంలో జోక్యం చేసుకోవాలని సీఎం కేసీఆర్ కోరారు. అంతేకాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు వీడియోలకు సంబంధించి గంటల తరబడి ఉన్న ఒరిజినల్ ఫుటేజీని కూడా వారికి పంపినట్లుగా ఆ మధ్య ప్రెస్ మీట్ లో సీఎం చెప్పారు. ఇలాంటి పరిస్థితిలో సీఎం కేసీఆర్ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఆ అంశంపై న్యాయ సలహా కోరేందుకు లేదా ఆ విషయంలో జోక్యం చేసుకోవాలని అడిగేందుకు సీఎం కేసీఆర్ సీజేతో భేటీ అయి ఉంటారని భావిస్తున్నారు. కానీ, దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. మరోవైపు, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్ ఈ ఏడాది జూన్ 28న ప్రమాణం చేసిన సంగ‌తి తెలిసిందే.


ఎమ్మెల్యేల కొనుగోలు నిందితుల బెయిల్‌పై తీర్పు వాయిదా


ఎమ్మెల్యేల కొనుగోళ్ల కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఏసీబీ కోర్టు పరిధిలోకి రాదని పిటిషనర్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ బీ ఫాంతో గెలిచారని.. ఆయనకు ఫిర్యాదు చేయడానికి అర్హత లేదని వాదించారు. దర్యాప్తు వేళ బెయిల్‌ మంజూరు చేస్తే విచారణకు ఆటంకం ఎదురవుతుందని పోలీసుల తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏకీభవించిన కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను రిజెక్ట్ చేసింది. ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితులుగా ఉన్న నందకుమార్‌, సింహయాజి, రామచంద్రభారతి ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ లో ఉన్నారు.