నాలుగు నెలలుగా తెలంగాణలో ఉత్కంఠత రేపిన మునుగోడు ఉప ఎన్నికలో విజయకేతనం ఎగురవేసిన కేసీఆర్‌ ఇదే స్పూర్తితో ముచ్చటగా మూడోసారి అధికారం కైవసం చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగానే మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్‌లో టిఆర్ఎస్ లెజిస్లేటివ్ పార్టీ, పార్లమెంటరీ పార్టీ, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గంతో కూడిన సంయుక్త సమావేశం కేసీఆర్ అధ్యక్షతన జరగనున్నది. ఈ సమావేశం ద్వారా గులాబీ నేతలను సాధారణ ఎన్నికల సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. 


కొత్తగా వచ్చిన రాష్ట్రంలో రెండు సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఎన్నికైన కేసీఆర్‌ మరోమారు తన అధికారం చేజెక్కించుకోవాలని ప్లాన చేస్తున్నారు. రాజకీయ చతురతతో మూడోసారి విజయం దిశగా పయనించేందుకు గులాబీ శ్రేణులను క్షేత్రస్థాయిలో సిద్ధం చేయబోతున్నారు. దీనికి ముందస్తుంగా ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 


టీఆర్‌ఎస్‌ పార్టీలో నెంబర్‌ 2 గా చలామణి అవుతున్న కేటీఆర్‌కు పగ్గాలు అప్పగించే పనికి కూడా వ్యూహ రచన జరుగుతోందా? అనేది ఆ పార్టీ వర్గాల్లో చర్చానీయాంశంగా మారింది. లేకపోతే ముందస్తుకు వెళ్లి మూడోసారి అధికారానికి మార్గం సుగమం చేసుకుంటారా..? ఇప్పుడు ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌గా మార్చుతున్న తరుణంగా బీఆర్‌ఎస్‌ పేరును ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి.. ఆ తర్వాత తాను దేశ రాజకీయాల్లోకి వెళ్లడం, తన కుమారుడిని రాష్ట్ర రాజకీయాలను అప్పగించడంపై చర్చ జరుగుతుందా..?. ఏది ఏమైనప్పటికీ దేశంలో చర్చగా మారిన మునుగోడు ఉపఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కేసీఆర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు..? అనూహ్యంగా టీఆర్‌ఎస్‌ఎల్పీ సమావేశం నిర్వహించడంపై ఇప్పుడు రాజకీయ వర్గాలో వాడివేడిగా చర్చ జరుగుతుంది.


అప్రమత్తం చేసే దిశగా..


తెలంగాణలో ఇప్పటి వరకు తన ఫార్ములాను అమలు చేసిన కేసీఆర్‌ మునుగోడు ఎన్నికల్లో విజయం సాధించారు. ఇదే ఫార్ములాను అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయడంతోపాటు ప్రతి నియోజకవర్గంపై సునిశితంగా పరిశీలించే అవకాశం ఉంది. నియోజకవర్గాల వారీగా పరిస్థితులను అంచనా వేసేందుకు ప్రజాప్రతినిధులతోపాటు నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లను నియమిస్తారని సమాచారం. దీని వల్ల కారులో పెరిగిన ఓవర్‌లోడ్‌కు కాస్తా ఉపశమనం కలిగించి, తన వద్దకు పూర్తి సమాచారం వస్తుందని కేసీఆర్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు కేవలం పార్మ్‌ హౌస్‌కే పరిమితం అని వచ్చే ఆరోపణలను ఢీకొట్టవచ్చు. తెలంగాణలోని అన్ని ప్రాంతాలను మరోమారు కలియతిరిగడంతోపాటు ఉపఎన్నికల విజయాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని జిల్లాలో పర్యటించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం.


సంక్షేమ పథకాలపై దృష్టి..


మరోమారు విజయాన్ని సొంత చేసుకునేందుకు ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేసి ప్రజల్లో ఉన్న తనకు ఉన్న వ్యతిరేతను తగ్గించుకునేందుకు ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందులో బాగంగా ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి.. నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై ఫోకస్‌ చేసేందుకు ఈ సమావేశంలో చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాల విమర్శలకు దీటుగా సంక్షేమ పథకాలను అమలు చేసి ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్‌ సిద్దమయేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. 


ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న నామినేటెడ్‌ పదవులను సైతం భర్తీ చేసేందుకు కేసీఆర్‌ సిద్దమవుతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ను తెలంగాణలో పటిష్టం చేసిన కేసీఆర్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, అందుకణుగుణంగా ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సిద్ధం చేయడం ద్వారా తాను దేశ రాజకీయాల్లోకి వెళ్లడం, కేటీఆర్‌కు తెలంగాణ పగ్గాలు అప్పగించేలా తన వ్యూహాన్ని అమలు చేసేందుకు ఈ సమావేశాన్ని వాడుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది. మరి ఈ సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతుందనేది మాత్రం వేచి చూడాల్సిందే.