తెలంగాణ బీజేపీ నేతలు ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానం నుంచి ఉన్నట్టుండి పిలుపు వచ్చింది. ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన పూర్తయ్యాక వీరు ఇద్దరిని హస్తినకు పిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నాయకులు ఇద్దరు మరో పార్టీ నుంచి బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేసివారే. ఒకరు ఘన విజయం సాధించగా, మరొకరు ఇటీవలే జరిగిన మునుగోడు ఉప సమరంలో ఓడిపోయారు. హైకమాండ్ పిలుపుతో వెంటనే ఇద్దరు నేతలు ఈటల, కోమటిరెడ్డి హస్తినకు పయనం అయ్యారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఈ ఇద్దరు నేతలు భేటీ అవుతారని తెలుస్తోంది. తెలంగాణలో మునుగోడు ఉప ఎన్నికల విషయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు రాజకీయాల గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కూడా వ్యూహాలు రచించుకునే అవకాశం ఉంది.


మునుగోడు ఉప ఎన్నిక ఫలితం కూడా గతంలో హుజూరాబాద్ ఉప ఎన్నిక తరహాలోనే తమకు అనుకూలంగా ఉంటుందని బీజేపీ ముందు నుంచి ధీమాగా ఉండేది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితంతో రాష్ట్రంలో తమకు అనుకూలంగా వచ్చిన స్వింగ్‌ను మునుగోడు ఉప ఎన్నికతో మరింత ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ భావించింది. అందుకు తగ్గట్లుగానే కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై బీజేపీ దృష్టి పడి ఆయన్ను తమ పార్టీలో చేర్చుకుంది. గెలుపు కోసం విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ అక్కడ టీఆర్ఎస్ విజయం సాధించింది.


కాంగ్రెస్ కోటకు బీటలు
ఉమ్మడి నల్గొండ జిల్లా అంటేనే కాంగ్రెస్‌కు కంచుకోట. అక్కడ ఆ పార్టీలోని నాయకులే బలంగా ఉండేవారు. వారికి దీటైన నాయకులు లేకపోవడంతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవానే ఎక్కువగా నడిచేది. ఆ జిల్లాలో ఇప్పటిదాకా మూడు ఉప ఎన్నికలు వచ్చాయి. 2019లో ఉత్తమ్ కుమారెడ్డి ఎంపీగా గెలిచాక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో వచ్చిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి శానం సైదిరెడ్డి గెలిచారు. ఆ తర్వాత నాగార్జున సాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మరణంతో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు నోముల భగత్ గెలిచారు. ఈయన కాంగ్రెస్ అభ్యర్థి, పార్టీ దిగ్గజ నేత అయిన  కె.జానారెడ్డి పైనే గెలుపొందడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ తర్వాత ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నికలోనూ టీఆర్ఎస్ గెలిచింది. కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి పోటీ చేయగా, మూడో స్థానంలో ఉండి కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికతో అధికార పార్టీకి ప్రధాన ప్రత్యర్థి పార్టీ బీజేపీ అని చాటినట్లయింది.


మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ కార్యకర్తల పోరాటాన్ని ప్రధాని మోదీ మెచ్చుకున్నారు. ఇటీవలి రామగుండం పర్యటనలో తెలంగాణ సర్కారుపై పరోక్షంగా నిప్పులు చెరిగిన మోదీ ఉపఎన్నిక ఫలితాన్ని చూస్తుంటే తెలంగాణలో కమలం వికసించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోందని అన్నారు. ఒక్క ఉపఎన్నిక కోసం ప్రభుత్వం అంతా దిగొచ్చిందని మోదీ గుర్తు చేశారు. త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాబోతుందని, పార్టీ కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్లాలని ప్రధాని మోదీ సూచించారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకమాండ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని, ఈటల రాజేందర్ ను ఢిల్లీకి ఆహ్వానిచటం సర్వత్రా ఆసక్తి నెలకొంది.