హైదరాబాద్‌లోని నాంపల్లి సెషన్స్ కోర్టు సంచలన తీర్పు చెప్పింది. గంజాయి స్మగ్లింగ్ కేసులో ఓ వ్యక్తికి ఏకంగా 20 ఏళ్ల జైలు శిక్ష వేసింది. ఇంకా రూ. లక్ష జరిమానా కూడా విధించింది. ఒకవేళ జరిమానా కట్టలేని పక్షంలో ఇంకో మూడేళ్ల జైలు శిక్ష పెరుగుతుందని తీర్పు చెప్పింది. గంజాయి అక్రమ రవాణా కేసులో వ్యక్తికి ఈ స్థాయిలో కోర్టు శిక్ష విధించడం సంచలనంగా మారింది. ఈ కేసులో నిందితుడైన నదీమ్‌ను కోర్టు దోషిగా తేలుస్తూ అతనికి 20 ఏళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది.
కేసు పూర్వాపరాలివీ..
రెండేళ్ల క్రితం అంటే 2020 ఆగస్టులో విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపైన పంతంగి టోల్ గేట్ వద్ద యూపీ 21 సీఎన్ 0853 నంబర్‌తో ఉన్న ట్రక్కును పోలీసులు అడ్డగించారు. అందులో 1,427 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. తర్వాతి రోజు డ్రైవర్ నదీమ్(25)ను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అరెస్ట్ చేసింది. ఈ గంజాయి విలువ రూ.3.56 కోట్లకు పైగానే ఉంటుందని సీజ్ చేసిన అధికారులు అప్పట్లో చెప్పారు. తూర్పు గోదావరి నుంచి ఉత్తరప్రదేశ్‌కు భారీ ట్రక్కులో గంజాయిని తరలిస్తుండగా డీఆర్‌ఐ హైదరాబాద్ విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో పంతంగి టోల్‌గేట్ వద్ద మాటు వేసి నదీమ్‌ను పట్టుకున్నారు. నార్కొటిక్ డ్రగ్ అండ్ సైకోట్రొపిక్ సబ్‌స్టాన్సస్ (ఎన్‌డీపీఎస్) చట్టం కింద అతనిపై కేసు నమోదు చేశారు.
తర్వాత ఆ మరుసటి రోజు (ఆగస్టు 21, 2020) నాంపల్లిలోని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కోర్టులో నిందితుణ్ని ప్రవేశపెట్టారు. ఎన్‌డీపీఎస్ యాక్ట్–1985 కింద చార్జిషీట్ దాఖలు చేశారు. సీజ్ చేసిన గంజాయితో పాటు కేసు తీవ్రతను కోర్టుకు డీఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ కేసును విచారించిన నాంపల్లి కోర్టు నేడు తుది తీర్పు ప్రకటించింది.
ఈ సందర్భంగా గంజాయి సరఫరా చేస్తున్న నదీమ్‌కు రూ.20 ఏళ్ల జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధిస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కాగా గంజాయితో పాటు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపేందుకు తెలంగాణ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడిన ఉద్యోగులు, సిబ్బందిపైన పలు ఐటీ సంస్థలు కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే డ్రగ్స్ తీసుకుంటున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులపై ఆయా కంపెనీలు వేటు కూడా వేశాయి. మొత్తం 13 మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులను ఆయా సంస్థలు ఉద్యోగాల నుంచి తీసేశారు. మరో 50 మందికి కూడా సాఫ్ట్‌వేర్ సంస్థలు నోటీసులు ఇచ్చాయి. డ్రగ్స్ సరఫరా చేస్తూ పట్టుబడిన నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగుల్ని గుర్తించారు. ఇటీవల పట్టుబడ్డ ప్రేమ్ కుమార్, టోని, లక్ష్మీపతి వద్ద నుండి డ్రగ్స్, గంజాయిని టెక్కీలు కొనుగోలు చేశారని పోలీసులు గుర్తించారు.