TS Groups Interveiws : నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో త్వరలోనే భారీగా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు రానున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై ప్రకటన చేశారు. ఈ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. తాజాగా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్-1, గ్రూప్-2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు అవసరం లేదనే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పోలీసు ఉద్యోగాల అభ్యర్థులకు కూడా కేబినెట్ శుభవార్త చెప్పింది. పోలీసు ఉద్యోగాలకు మూడేళ్ల వయోపరిమితి పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
యూనివర్సిటీల్లో ఖాళీలు భర్తీకి కేబినెట్ ఆమోదం
వీటితో మరిన్ని కీలకనిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ ఓకే చెప్పారు. తెలంగాణ భవన్‌లో కేబినెట్ భేటీ ముగిసిన సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని యూనివర్సిటీల్లో కలిపి దాదాపు 3,500 పైగా ఖాళీలున్నాయన్నారు. కామన్ బోర్డు ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. యూనివర్సిటీల్లో టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్ ఖాళీల వివరాలు సేకరించి త్వరలో భర్తీ చేస్తామన్నారు. ఈ నియామకాలు పారదర్శకంగా చేపట్టనున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
ఇంటర్వ్యూలు రద్దు
గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో ఇంటర్వ్యూలు ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గ్రూప్ 1లో ఇంటర్వ్యూకి వంద మార్క్ లు, గ్రూప్ 2 లో ఇంటర్వ్యూ కి 75 మార్కులు ఉండేవి. సమయం ఆదాతో పాటు అవినీతి ఆరోపణలు రాకుండా ఉండేందుకే ఇంటర్వ్యూలు ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే పోస్ట్ ల్లో ఈ రెండింటికీ ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. ఇటీవల అసెంబ్లీలో సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటల్లో ముందుగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిల్లో 503 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ, గ్రూప్ 2 పోస్టులకు ఇంకా అనుమతి ఇవ్వలేదు. ఇంటర్వ్యూలపై క్లారిటీ వచ్చాకే నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
Also Read : Telangana CM KCR Press Meet: వరి రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ - రాష్ట్ర ప్రభుత్వం తరఫున వడ్లు కొనుగోలు