పాతబస్తీలో ఇటీవల జరిగిన లాల్ దర్వాజ అమ్మవారి వేడుకల్లో చికోటి ప్రవీణ్ అనుచరుడు తుపాకీ తేవడం వివాదాస్పదం అయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో చికోటి ప్రవీణ్ ను ఏ-1 గా పోలీసులు చేర్చారు. అయితే, తాజాగా నాంపల్లి కోర్టులో చికోటి ప్రవీణ్‌కు ఊరట దక్కింది. ఆయనకు నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. చికోటి ప్రవీణ్‌పై ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జన సమూహంలోకి ప్రైవేటు సిబ్బందితో రావడం చట్టరీత్యా నేరం కావడంతో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఈ కేసులు పెట్టారు.


గత ఆదివారం పాత బస్తీలో జరిగిన లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గరికి ప్రైవేట్ సెక్యూరిటీతో చికోటి ప్రవీణ్ వచ్చారు. కాపలా డ్యూటీల్లో ఉన్న పోలీసులు ప్రైవేట్ సెక్యూరిటీని అడ్డుకుని వారిని చెక్ చేయగా, ఆయుధాలు బయటపడ్డాయి. ఆ ప్రైవేటు సెక్యురిటీలో ముగ్గురి దగ్గర తుపాకీలు ఉండటంతో టాస్క్‌ఫోర్సు పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఆ తుపాకీలకు లైసెన్స్ లేకపోవడంతో చత్రినాక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. చికోటి ప్రవీణ్‌తో పాటు ముగ్గురు వ్యక్తిగత సిబ్బందిపై కూడా చీటింగ్, ఫోర్జరీ, ఆర్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 223/2023 లో సెక్షన్‌లు 420, 467, 468, 471 ఐపీసీ కింద ముగ్గురు వ్యక్తులపై నమోదు చేశారు. తర్వాత సెక్షన్ లను ఆల్టర్ చేస్తూ 420, 109 ఆర్మ్స్ యాక్ట్ 25, 30 కింద సెక్షన్ లను ఛత్రినాక పోలీసులు మార్చారు. A1 గా చికోటి ప్రవీణ్, A2 గా రాకేష్, A3 గా సుందర్ నాయక్, A4 గా రమేష్ గౌడ్‌లపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు కావడంతో చికోటి ప్రవీణ్‌కు తాజాగా ఊరట దక్కింది.


తుపాకీలకు ఒరిజినల్ పత్రాలు ఉన్నాయి - చికోటి









తమ వద్ద ఉన్న తుపాకీలకు సంబంధించి ఒరిజినల్ లైసెన్స్‌ పత్రాలను చాలా నెలల క్రితమే తాము ఛత్రినాక పోలీస్ స్టేషన్ లో సమర్పించామని చీకోటి ప్రవీణ్ కొద్ది రోజుల క్రితమే వివరణ ఇచ్చారు. తనకు ప్రాణ హాని ఉన్నందున ప్రైవేటు సెక్యురిటీతో భద్రత ఏర్పాటు చేసుకున్నానని చెప్పారు. తుపాకీలకు లైసెన్స్ ఉందని తమకు డాక్యుమెంట్స్ చూపించారని వెల్లడించారు. పత్రాలు మొత్తం పరిశీలించాలని లోకల్‌ పోలీస్‌ స్టేషన్‌లలో సమర్పించానని, వారు డాక్యుమెంట్స్ చూసి ఎలాంటి రిపోర్టు ఇవ్వలేదని అన్నారు.


ఆ డాక్యుమెట్స్ ఫోర్జరీ అని ఇప్పుడు పోలీసులు అంటుననారని, అవి నకిలీ అంటూ తమపైనే పోర్జరీ కేసు పెట్టారని చికోటి ప్రవీణ్ చెబుతున్నారు. నకిలీ పత్రాలు అయితే తాము పోలీస్ స్టేషన్ కు పంపినప్పుడే ఎందుకు చెప్పలేదని అన్నారు. ఇది పోలీసుల తప్పిదమే అని చికోటి ప్రవీణ్ తప్పు బట్టారు. ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఉంటే చర్యలు తీసుకోవాలని తేల్చి చెప్పారు. గజ్వేల్‌ ఘటన తర్వాత తనను టార్గెట్‌ చేశారని చికోటి ప్రవీణ్ విమర్శించారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక తనపై ఇలాంటి ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు. మతం కోసం, హిందూత్వం కోసం తాను పోరాటం చేస్తూనే ఉంటానని చెప్పుకొచ్చారు.