పని చేసే ప్రభుత్వానికి , పనికి వచ్చే నాయకుడికి మరోసారి అవకాశం ఇచ్చి హ్యాట్రిక్‌ కొట్టేలా చూడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన 20వ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన సందర్భంగా మంత్రి కేటీఆర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. పదేళ్లు ప్రతిపక్షాలు చూసింది ట్రైలర్ మాత్రమేనని అసలు సినిమా ముందు ఉందని సూచించారు. 2023లోనే ఆసినిమా చూడబోతున్నారని అన్నారు. 


వీఎస్టీ నుంచి ఇందిరా పార్క్‌ వరకు నిర్మించిన నాయిని నర్సింహారెడ్డి స్టీల్‌ ఫ్లైఓవర్‌ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ముసిరాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... 2.25 కిలోమీటర్లు పొడవు టున్న నాలుగు రహదారుల ఉక్కు వంతెన ప్రారంభించారు. ఈ బ్రిడ్జి నిర్మాణానికి 450కోట్లు ఖర్చు పెట్టారు. ఇది వీఎస్టీ జంక్షన్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ఇందిరాపార్క్ క్రాస్‌రోడ్డు మీదుగా వెళ్లే ప్రయాణికుల ట్రాఫిక్ కష్టాలు తీర్చనుంది. ఈ మార్గంలో వెళ్లాలంటే గంటల సమయం వృథా అవుతుంది. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ప్రజలకు సమారు అరగంట జర్నీ కలిసి వస్తుంది. 


భవిష్యత్‌లో ఇందిరాపార్క్‌తోపాటు లోయర్‌ ట్యాంక్‌ బండ్‌, అప్పర్‌ ట్యాంక్‌ బండ్‌ను కలిపి సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని స్థానిక నాయకులకు హామీ ఇచ్చారు కేటీఆర్. ఈ క్రమంలో చెప్పుడు, తప్పుడు మాటలు విని ప్రజలు తప్పుడు నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. ఏదైనా తప్పు జరిగితే మరో వందేళ్లు వెనక్కి వెళ్లిపోతామని హెచ్చిరించారు కేటీఆర్. 


గతంలో హైదరాబాద్‌లో నెలలో వారం పదిరోజులు కర్ఫ్యూ వాతావరణం ఉండేదని ఇప్పుడు అలాంటి పరిస్థితులే కనిపించడం లేదన్నారు కేటీఆర్. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చి దిద్దే క్రమంలో అందర్నీ కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నామని అన్నారు. ఎవరికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూరుస్తున్నామని గుర్తు చేశారు. పరిశ్రమలు, పెట్టుబడులను ఆకర్షిస్తూ ఉద్యోగాలను కల్పిస్తూ పేదలను కాపాడుకుంటున్నామని తెలిపారు. 


గతంలో అధికారంలో ఉన్న టైంలో ఏం చేయని వాళ్లు, కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఎలాంటి సాయం చేయని వాళ్లు ప్రజలకు ముందుకు వస్తున్నారని జాగ్రత్తగా ఉండాలన్నారు కేటీఆర్. ఇప్పుడు వచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు యత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. దూసుకుపోతున్న మన కాళ్లలో కట్టె పెడుతున్నారని విమర్శించారు. ఎలాంటి సమస్యలకు తావు లేకుండా పదేళ్లు ఎలా పని చేశామో భవిష్యత్‌లో కూడా అలానే పని చేస్తామని హామీ ఇచ్చారు కేటీఆర్. కేసీఆర్‌ను హ్యాట్రిక్‌ సీఎంగా అక్కడ కూర్చోబెడదామంటూ పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు 10 ఏళ్లు చూసింది ట్రైలర్‌ మాత్రమే సినిమా 2023లో చూడబోతున్నారని హెచ్చరించారు. 


రెండున్నర ఏళ్లలో నిర్మాణం
2020 జులై 10న ఈ ఫ్లైఓర్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. 2021 జనవరిలో పనులు ప్రారంభమయ్యాయి. కేవలం రెండున్నర ఏళ్లలో 4 లైన్ల రోడ్‌తో స్టీల్ బ్రిడ్జి నిర్మించారు. రూ.450 కోట్ల అంచనా వ్యయం కాగా 12,500 మెట్రిక్ టన్నుల ఇనుమును ఉపయోగించారు. సన్నటి ఐరన్ పిల్లర్లు 81, 426 దూలాలు నిర్మించారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ మీద నుంచి వచ్చే వాహనాలు ఓయూ, నల్లకుంట వైపు వెళ్లాలంటే 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. జంక్షన్లు ఎక్కువగా ఉండటంతో ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణంతో 2.6 కిలోమీటర్ల దూరమైన లోయర్ ట్యాంక్ నుంచి వీఎస్టీ వరకు 5 నిమిషాల్లో వెళ్లొచ్చు.