తెలంగాణ పార్టీ అధ్యక్షుడి మార్పుతో కాస్త వెనుకంజలో ఉన్న బీజేపీకి సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా గుడ్‌ చెబుతున్నారు. దీనికి తోడు ఢిల్లీ నుంచి వచ్చిన సీనియర్ నాయకుడు ఒకరు చేసిన కామెంట్స్‌ మరింత ఇబ్బందిలో పడేశాయి. కాసేపటికే జరిగిన డామేజ్‌ను సవరించుకొని వివరణ ఇచ్చుకున్నా ఫలితం లేదంటోంది కేడర్. 


కష్టాల్లో ఉన్న బీజేపీలో ఊపు తీసుకొచ్చేందుకు ఢిల్లీ నుంచి ఒక్కొక్కరుగా సీనియర్ లీడర్లు వస్తున్నారు. ఇక్కడ కేడర్‌తో సమావేశమవుతూనే ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అలా చేసే ప్రయత్నంలో బీజేపీ సీనియర్ నేతల మురళీధర్‌రావు చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ కేసీఆర్‌ ప్రవేశ పెట్టిన పథకాలపై ఆసక్తికరమైన  వ్యాఖ్యలు చేశారు. 


తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలకు పోటీగా ఎలాంటి పథకాలు తీసుకొచ్చినా కష్టమని మురళీధర్‌రావు అన్నట్టు ప్రచారం జరిగింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య మాస్ ఇమేజ్ ఆ పార్టీ విజయానికి తోడ్పడిందని కూడా కామెంట్ చేసినట్టు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. పార్టీలోని విభేదాలపై ఆయన స్పందించినట్టు చెప్పుకున్నారు. పార్టీలో ఇతర నేతలను బండి కలుపుకొని వెళ్లలేదని కామెంట్ చేసినట్టు వైరల్ అయింది. ఇలా ఆయన కామెంట్స్ చేసినట్టు ప్రధాన మీడియా రావడంతో సోషల్ మీడియాలో కూడా తెగ డిస్కషన్ నడిచింది. 






మురళీధర్‌రావు చేసిన కామెంట్స్‌పై రకరకాల ప్రచారం జరగడంతో రాత్రి ఆయన వివరణతో కూడిన వీడియోను విడుదల చేశారు. తెలంగాణ కచ్చితంగా బీజేపీ విజయం సాధిస్తుందని.. పార్టీ నేతలంతా కలిసికట్టుగా బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని కూలదోస్తామన్నారు. 2014 నుంచి ఏ పార్టీ ఎలాంటి పని చేస్తుందో ప్రజలు గమనించారని అదే ఈ ఎన్నికల్లో విజయాన్ని డిసైడ్ చేస్తుందన్నారు. పార్టీలో మార్పులు కూడా వ్యూహాత్మకంగా అధినాకయత్వం తీసుకుందని ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు.