Murali Akunuri: హైదరాబాద్‌లో భూ ఆక్రమణలు.. ఎటూ చూసినా అక్రమ నిర్మాణాలే దర్శనమిస్తున్నాయి. ఈ ఆరోపణలపై నిత్యం ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ మోసాల వెనుక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు, రాజకీయ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ప్రభుత్వం అలాంటి కేసులపై కఠినంగా వ్యవహరిస్తోంది. ఎక్కడ అక్రమ నిర్మాణాలు జరిగినా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇందుకోసం వ్యవస్థను పటిష్టం చేసింది. ఇందుకోసం హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేశారు. ఐజీ రంగనాద్‌ను చీఫ్‌గా నియమించారు. దీంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పుడు హైడ్రాకు పెద్ద ఎత్తున అధికారులను కేటాయిస్తూ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ ఉత్తర్వులు జారీ చేశారు.  దీంతో ఆయన డైనమిక్ గా ముందుకెళ్తున్నారు.


హైడ్రాకు 259మంది సిబ్బంది
మొత్తం 259 మంది అధికారులు, సిబ్బందిని కేటాయించారు. ఒక ఐపీఎస్, ముగ్గురు గ్రూప్ 1 స్థాయి ఎస్పీఏలు, 5 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 21మంది ఇన్స్పెక్టర్లు, 33మంది ఎస్సైలు, 12మంది రిజర్వ్ ఎస్సైలు, 101మంది కానిస్టేబుల్స్, 72మంది హోంగార్డ్స్, అనలిటికల్ ఆఫీసర్లు ,  అసిస్టెంట్ అనలిటికల్ ఆఫీసర్లు హైడ్రాకు కేటాయించారు. ఇప్పటికే హైడ్రా తనపని ప్రారంభించింది. పలు అక్రమ కట్టడాలను కూల్చేసింది. హైడ్రా చేసేది ఆక్రమిత స్థలం లేదా చెరువులను ఆక్రమించి కట్టిన ఏ నిర్మాణాన్ని అయినా నేరుగా కూల్చివేస్తుంది.   


ఏవీ రంగనాథ్ పై ప్రశంసల వర్షం
హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై అడ్డంకులు ఏర్పడుతున్న.. ఆ సంస్థ కమిషనర్ ఏవీ రంగనాథ్ వెనకడుగు వేయకపోవడాన్ని మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ప్రశంసించారు. నగరంలో హైడ్రా చేపడుతున్న కూల్చివేతలపై మురళి గురువారం సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్  వేదికగా స్పందించారు. ఆయన ఏవీ రంగనాథ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. దీంతోపాటు ఓ పాలనపరమైన సూచన కూడా చేశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి..  రంగనాథ్ కి పూర్తి ప్రోత్సాహం ఇవ్వాలంటూ ఆకునూరి మురళి అన్నారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా హైడ్రా సంస్థ చేపడుతున్న కూల్చివేతలపై ఎక్స్ వేదికగా స్పందించిన ఆయన ఈ సంస్థ కమీషనర్ ఏవీ రంగనాథ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ.. ఒక అడ్మినిస్ట్రేటివ్ చిట్కా అందించారు. ఈ సందర్భంగా.. ‘‘మంచి పని చేస్తున్నారు శభాష్ రంగనాథ్.. మరింత ముందుకు సాగండి. మన ప్రజాప్రతినిధులు చాలా మంది దీనిని సహజంగా తీసుకొని అడ్డగోలుగా ప్రభుత్వ, చెరువు శిఖం భూములను ఆక్రమిస్తున్నారు. గత పాలకులు మేము తింటాము మీరు తినండి అని అందరిని దొంగలుగా మార్చినారు.  లక్షల కోట్ల భూములను, ప్రాణాలను రక్షించే చెరువులను కాపాడుకోవాలి. భవిషత్ తరాలకు మంచి పర్యావరణాన్ని అందించాలి’’. అని తెలియజేశారు.






 
హైడ్రాను విస్తరించండి
ఇక ముఖ్యమంత్రి హైడ్రా ని ఇంకా బలోపేతం చేసి, రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి..  ప్రభుత్వ భూములను, చెరువులను కాపాడాలని ఆయన కోరారు. అలాగే రంగనాథ్ కి పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వాలని సూచించారు. మనం ట్రాన్స్ పరెంట్ గా ఉండడమే కాదు ఉన్నట్టు కూడా కనిపించాలని, ఇది రంగనాథ్ కి అడ్మినిస్ట్రేటివ్ టిప్ అని ఎక్స్ లో రాసుకొచ్చారు.  ఏవీ రంగనాథ్ హైదరాబాద్ లో ప్రభుత్వ భూముల అక్రమణలకు సంబందించిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని హైడ్రా ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా అక్రమ కట్టడాలపై కొరఢా ఝులిపిస్తున్నారు.