Minister Seethakka: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించిన సంగతి తెలిసిందే. ఈ అవకాశం పై రాష్ట్రవ్యాప్తంగా మహిళలు హర్షం వ్యక్తం చేస్తుండగా ప్రతి పక్షాలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్న మహిళల గురించి కేటీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చేసిన  వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఘాటుగా స్పందించారు.


ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని  మాజీ మంత్రి కేటీఆర్ అత్యంత జుగుప్సాకరంగా మాట్లాడారంటూ ఆమె మండిపడ్డారు. కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ‘మీ తండ్రి గారు మీకు నేర్పిన గౌరవం, సంస్కారం ఇదేనా కేటీఆర్? మీ ఆడపడుచులు అంతా బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారా? ఆడవాళ్లంటే మీకు గౌరవం లేదు’ అంటూ మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సీతక్కతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా యావత్ మహిళా లోకం ఒక్కసారిగా భగ్గమంటోంది. కేటీఆర్ వ్యాఖ్యలపై తాజాగా.. మంత్రి సీతక్క ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను మంత్రి సీతక్క తప్పుబట్టారు.   


 కేటీఆర్ క్షమాపణ చెప్పాల్సిందే
కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం అని, వెంటనే ఆయన బేషరతుగా తెలంగాణ మహిళా లోకానికి తక్షణం క్షమాపణలు చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు. ఆడవాళ్లను అవమానించేలా బ్రేక్ డ్యాన్సులు చేసుకోండని అనడం ఆయన బుర్రలో ఉన్న బురదకు నిదర్శమంటూ మంత్రి విమర్శించారు. గత పదేళ్లు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్‌లో క్లబ్‌లు, పబ్‌లు, బ్రేక్ డాన్సులు ఎంకరేజ్ చేసిన చరిత్ర మీదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు ఆర్థికంగా ఎదగాలని, సాధికారత సాధించాలనే లక్ష్యంతో వారి కోసం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామంటూ వివరించారు. అందులో భాగంగానే పేద మహిళలకు రవాణా భారాన్ని తగ్గించడానికి ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్నామన్నారు. 






పని చేసుకుంటే తప్పేంటి 
శ్రమ జీవులు, శ్రామిక మహిళలు ప్రయాణ సమయంలో సమయం వృథా చేయకుండా ఏదో పని చేసుకుంటే తప్పేంటని మంత్రి సీతక్క నిలదీశారు. అంతమాత్రానా వారిని బ్రేక్ డ్యాన్సులు వేసుకోమని అంటారా? ఇది దుర్మార్గమన్నారు. ఇంటి వద్ద చేసుకునే చిన్నా చితక పనులు బస్సుల్లో చేసుకుంటే.. మహిళలను బ్రేక్ డ్యాన్సులు చేసుకోమనండనే మాటలు నోటికి ఎలా వచ్చాయి కేటీఆర్ అంటూ ప్రశ్నించారు. అంతటి ధైర్యం ఎలా వచ్చిందంటూ ఆగ్రహించారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్, బీఆర్ఎస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఉపయోగపడే పథకాలను తమ ప్రభుత్వం  అమలు చేస్తే వారికి నచ్చడం లేదన్నారు. పోనీ గత పదేళ్లలో ఉచిత బస్సు ప్రయాణ ఆలోచన వారికి తట్టనేలేదని మంత్రి సీతక్క ఎద్దేవా చేశారు. అలాంటి మంచి పథకాన్ని తాము అమలు చేస్తే దానిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.  కేటీఆర్ తక్షణమే బహిరంగంగా మహిళలకు క్షమాపణలు చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు.


అసలు కేటీఆర్ ఏమన్నారంటే?
ఇటీవల కాలంలో బస్సుల్లో కొందరు కూరగాయలు అమ్మడం, బ్రష్ చేయడం, వెల్లుల్లి ఒలుస్తూ, కుట్లు వేస్తూ కనిపించడంపై సోషల్ మీడియా వేదికగా పెద్ద చర్చలే జరిగాయి. ఈ వ్యవహారంపై కేటీఆర్ స్పందించారు.. కుట్లు, అల్లికలే కాదు.. అవసరమైతే డ్యాన్సులు కూడా చేసుకోండని అవమానకరంగా మాట్లాడారు. తాము తప్పు అని అనడం లేదని.. బస్సులు పెంచండని, అవసరమైతే ఒక్కొక్కరికి ఒక్కో బస్సు కేటాయించండంటూ హేళన చేస్తూ మాట్లాడడం ఇప్పుడు వివాదాస్పదం అయింది. కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సీతక్క స్పందిస్తూ ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను ఎగతాళి చేస్తున్న వారికి స్వయం సహాయక సంఘాల మహిళలు బుద్ధి చెప్పాలన్నారు.