HYDRA Action On Illegal Constructions: జీహెచ్‌ఎంసీ పరిధిలోని లేక్ బఫర్ జోన్‌లో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను కాపాడే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారు. ఇది నగరంలోని బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలపై కొరడా ఝులిపించింది. నగరంలో ఆక్రమణలపై ప్రజల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి. దశలవారీగా హైడ్రా పని చేస్తుంది. మొదటి దశలో ఆక్రమణలను అరికట్టడం.. రెండో దశలో అక్రమ నిర్మాణాలు, అనుమతుల నిరాకరణపై చర్యలు తీసుకుంటారు. మూడో దశలో చెరువుల్లో పూడిక తీసి వర్షపు నీటిని మళ్లించనున్నారు. గ్రేటర్ పరిధిలో వరుస దాడులతో అక్రమ నిర్మాణాలు, కబ్జాలను పెద్దమొత్తంలో తొలగిస్తున్నారు.
బాచుపల్లిలో కూల్చివేతలు
బాచుపల్లి ఎర్రకుంట ప్రాంతంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు ప్రారంభించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలు నేలమట్టం అవుతున్నాయి. ఉదయం నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. కాగా, నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి హైడ్రాకు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ క్రమంలో నగర శివారులో చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన ఆక్రమణదారులపై హైడ్రా అధికారులు దృష్టి సారించారు.
గత వారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గాజులరామారం, దేవేందర్‌నగర్‌లో హైడ్రా ఆధ్వర్యంలో అక్రమ కట్టడాలను కూల్చివేసిన విషయం తెలిసిందే. 329, 342 సర్వే నంబర్లలోని ప్రభుత్వ భూముల్లో సుమారు 51 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ప్రభుత్వ భూమి, చెరువు ఆక్రమణలో నిర్మాణం చేపడితే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.
చాలా చెరువులు మాయం
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 400లకు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయని ఏవి రంగనాథ్ తెలిపారు. ఎన్‌ఆర్‌ఎస్‌సి నివేదిక ప్రకారం గత 44 ఏళ్లలో నగరంలో అనేక చెరువులు కనుమరుగయ్యాయి. అనేక చెరువులు ఆక్రమణలకు గురై నిర్మాణాలు చేపట్టారు. అలాంటి అక్రమ నిర్మాణాలను గుర్తించి తొలగిస్తారు. బఫర్ జోన్‌లో అక్రమ కట్టడాలను తొలగించకుంటే హైదరాబాద్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో ప్రభుత్వం హైడ్రామాకు పెద్దఎత్తున సిబ్బందిని నియమించనుందని తెలిపారు. హైడ్రాలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. హైడ్రా పరిధి 2,500 చదరపు కిలోమీటర్లు అని ఆయన చెప్పారు.
అవకాశవాదంతో గొలుసుకట్టు చెరువులన్నీ ఆక్రమణలకు గురయ్యాయన్నారు. చెరువులకు నీటిని మళ్లించే కాల్వలు కూడా పూడుకుపోయాయి. చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ప్లాట్లు కొనుగోలు చేయవద్దని ప్రజలను కోరారు. రాజకీయ ఆరోపణలపై స్పందించబోనని ఏవీ రంగనాథ్ అన్నారు. బఫర్ జోన్, ఎఫ్‌టిఎల్ పరిధిలో నిర్మాణం చేపట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి తీసుకొస్తామని ఆయన అన్నారు.