కొద్ది రోజులుగా హైదరాబాద్‌లో పార్టీ కల్చర్ పక్కదారి పట్టిన ఘటనలు వెలుగులోకి వస్తున్న సంగతి తెలిసిందే. విలాసవంతమైన పబ్‌ల కేంద్రంగా డ్రగ్స్ పంపిణీ, విదేశీ యువతులతో అర్ధనగ్న డాన్సులు, అభ్యంతరకర పనులతో నగరంలోని చాలా పబ్‌లు వార్తల్లో నిలిచాయి. వివిధ పార్టీల పేరుతో నిబంధనలు మీరుతున్నారని పోలీసులు నోటీసులు సైతం జారీ చేశారు. తాజాగా హైదరాబాద్ పాత బస్తీలో ముజ్రా పార్టీ కలకలం రేపింది.
హైదరాబాద్ పాత బస్తీలోని రెయిన్ బజార్‌లో ముజ్రా పార్టీ కలకలం రేపింది. మంజు మియా తాబేలాలో ఓ యువకుడి బర్త్ డే పార్టీ వేడుకలను నిర్వహించారు. అర్ధరాత్రి 12 గంటలకు మొదలై తెల్లవారుజామున వరకు బర్త్ డే వేడుకలు సుదీర్ఘంగా జరిగాయి. ఈ పార్టీలో మహిళా డ్యాన్సర్లను పెట్టి అర్ధ రాత్రి వరకు అర్ధనగ్న డాన్సులు నిర్వహించారు. ఈ వేడుకలను స్థానికులు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, అవి వైరల్ గా మారాయి. వేడుకలపై స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోని పరిస్థితి ఉందని స్థానికులు చెబుతున్నారు. ఆ బర్త్ డే వేడుకలను నిర్వహించిన యువకుడి తండ్రికి పోలీసులతో మంచి పరిచయాలు ఉండటంతో వారు చూసీ చూడనట్లు ఉన్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఇటీవలే రెండు పబ్ లపై చర్యలు
సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్ సమీపంలోని రామ్‌గోపాల్ పేటలో బార్ అండ్ రెస్టారెంట్ ముసుగులో పబ్ గా మార్చేసిన ఘటన ఆదివారం వెలుగు చూసింది. అంతేకాక, ఇందులో యువతులతో అభ్యంతరక రీతిలో డాన్సులు చేయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ విషయం గురించి సమాచారం అందుకున్న సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం ఈ పబ్‌పై దాడులు చేశారు. అక్కడే ఉన్న నిర్వహకులు, కస్టమర్లతో పాటు మొత్తం 18 మందిని అరెస్టు చేశారు.
హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ఓ పబ్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు కూడా బయటికి వచ్చాయి. ఈ పబ్‌లో రష్యాకు చెందిన యువతులతో సెమీ న్యూడ్ డ్యాన్స్‌లు చేయించారు. దీనిపై కూడా పోలీసులు దాడి చేసి సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.