Musi River News: హైదరాబాద్‌లో భారీ వరద ప్రవాహంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. జంట జలాశయాలు సహా హుస్సేన్ సాగర్‌కు వరద పోటెత్తుతోంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్, హుస్సేన్‌సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మూసారంబాగ్, చాదర్‌ఘాట్, పురానాపూల్ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్‌సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్‌సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్‌సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.
చాదర్‌ఘాట్, మూసారంబాగ్ వంతెనలు మూసివేత
భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ ల నుంచి భారీగా వరద వస్తుండడంతో మంగళవారం రాత్రి మూసీ ఉగ్రరూపం దాల్చింది. చాదర్‌ఘాట్, మూసారంబాగ్ వంతెనలపై నుంచి మూసీ ప్రవహిస్తోంది. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగాయి. అధికారులు ఈ రెండు వంతెనలను మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. వంతెనకు రెండువైపులా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
అంబర్ పేట కొత్త బ్రిడ్జిపైనుంచి వాహనాలు
మూసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిలు మూసివేయడంతో అంబర్‌పేట కొత్త బ్రిడ్జి పైనుంచి వాహనాలు వెళ్తున్నాయి. ఆఫీసులు, పనుల మీద ఒక్కసారిగా వాహనదారులు చేరుకోవడంతో అంబర్ పేట కొత్త బ్రిడ్జిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మరికొన్ని చోట్ల ప్రజలు తమ వాహనాల్లో వేరే మార్గాల్లో వెళ్లే ప్రయత్నం చేయగా, వేరే మార్గాల్లో కూడా బాగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
అంబర్‌పేట్, మలక్‌పేట్ పరిసరాల్లోని లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. రత్నానగర్, పటేల్‌నగర్, గోల్నాకలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మదర్సా, శంకర్‌నగర్, మూసానగర్ నుంచి సుమారు రెండు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు.