హైదరాబాద్ లో కురుస్తున్న వర్షాలకు చెరువులు, నాలాలు పొంగి పొర్లుతున్నాయి. వందలాది లోతట్టు ప్రాంతాలు మురుగునీటితో నిండిపోయాయి. చార్మినార్, బహదూర్‌పుర, మలక్‌పేట ప్రాంతాల్లో కొన్నిచోట్ల దుర్గంధం వ్యాపించింది. బురద బాగా పేరుకుపోతోంది. ఎంజీబీఎస్, హైకోర్టు, ముసారంబాగ్ తదితర ప్రాంతాల్లో మూసీ నది ప్రవాహం ప్రమాదకర స్థితిలో ఉంది. మూసారంబాగ్ వంతెనపై నుంచి నీరు ప్రవహించడంతో రాకపోకలను పూర్తిగా నిషేధించారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో కురిసిన కుండపోత వర్షాలతో ఈసీ, మూసీ, కాగ్నా నదులకు పెద్ద ఎత్తున వరద వచ్చి ఇళ్లు, పంటలు మునిగిపోయాయి.
మంగళవారం రాత్రి కూడా NDRF యంత్రాంగం ఉస్మాన్ సాగర్ సమీపంలో ఉన్న ఒక ఫామ్‌హౌస్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఒక ఫ్యామిలీని రక్షించింది. ఇందులో ఒక చంటి పిల్లవాడుతో సహా 5 గురు ఉన్నారు. ఉస్మాన్ సాగర్ 12 గేట్లను అధికారులు తెరిచారు. సౌత్ జోన్ డీసీపీ సాయి చైతన్య నేతృత్వంలో అధికారులు, ఏఐఎంఐఎం కార్పొరేటర్లు మంగళవారం రాత్రి లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.బహదూర్ పురా, కిషన్ బాగ్ ప్రాంతాల్లో మూసీ నది సమీపంలో నివసించే ప్రజలను అప్రమత్తం చేశారు.
మరోవైపు మూసారాంబాగ్ వంతెనపై మూసీ నీరు ప్రవహిస్తోంది. మూసారాంబాగ్ ప్రాంతంలో మూసీ పరీవాహక ప్రాంతంలోని కాలనీలను ఎలర్ట్ చేశారు. ముందు జాగ్రత్తగా మూసారాంబాగ్ వంతనపై రాకపోకలను నిలిపివేశారు. అంబర్‌పేట, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు గోల్నాక లేదా చాదర్‌ఘాట్ మీదుగా ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రజలను కోరారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ కు బాగా అంతరాయం ఏర్పడుతోంది. మూసీ నదీ ప్రవాహం వల్ల ఇంకా కొన్ని కాలనీలు నీటిలో నే ఉన్నాయి. అధికారులు నీటి తరలించే ప్రయత్నాలు చేస్తున్నారు. మూసీ వెంబడి లోతట్టు ప్రాంతాలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు.
మరోవైపు, వికారాబాద్ జిల్లా కేంద్రంలో పలుచోట్ల 150 ఇళ్లు నీటమునిగాయి. వికారాబాద్ కలెక్టర్ కార్యాలయం ప్రాంతం కూడా వరదలో చిక్కుకుంది. రికార్డు స్థాయిలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్‌లకు వరద పోటెత్తుతుండడంతో మంగళవారం రాత్రి 10 గంటల సమయానికి 13 వేల క్యూసెక్కులను మూసీ నదిలోకి వదిలారు. దీంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. అయితే, అధికారులు పట్టించుకోవట్లేదంటూ కూకట్‌పల్లి, బుల్కాపూర్ నాలా పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ప్రాంతంలో 12 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా కోహెడ రహదారిపై మోయతుమ్మెద వాగుకు వరద రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలో మల్కాపూర్, తొగరపు చెరువులు మత్తడిపై వరద ప్రవహిస్తోంది.