Cases on Mohammed Azharuddin: కాంగ్రెస్ సీనియర్ నేత, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు ముందస్తు బెయిల్ వచ్చింది. ఉప్పల్ పోలీస్ స్టేషన్‌లో అజారుద్దీన్‌పై నమోదైన ఓ కేసులో మల్కాజిగిరిలో కోర్టు ఊరట కల్పించింది. అజారుద్దీన్ హెచ్‌సీఏ ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో కోట్ల రూపాయల నిధులను ఆయన పక్కదారి పట్టించారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో ముందస్తు బెయిల్ కోసం మల్కాజ్‌ గిరి కోర్టుని అజారుద్దీన్ ఆశ్రయించారు. మల్కాజ్ గిరి కోర్టు ఈ పిటిషన్ పై సోమవారం విచారణ జరిపి అజారుద్దీన్ కు ఊరట కల్పించింది. ముందుస్తు బెయిల్‌ ఇచ్చింది. 41 సీఆర్పీసీ కింద అజారుద్దీన్ కు నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని కోర్టు ఆదేశించింది. అటు అజారుద్దీన్ ను కూడా పోలీసుల విచారణకు సహకరించాలని చెప్పింది. 


అజారుద్దీన్ కు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లో నామినేషన్ వేయాల్సి ఉంది. ఈ సమయంలో కేసులో చిక్కుకున్న అజారుద్దీన్ కు బెయిల్ రాకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉండేది. ఎట్టకేలకు ముందస్తు బెయిల్ రావడం వల్ల అజారుద్దీన్ నామినేషన్ వేయడానికి మార్గం సుగమం అయింది.


కేసు వివరాలు ఇవీ..


హెచ్‌సీఏ (Hyderabad Cricket Association)లో భారీ అవినీతి జరిగిందని అజారుద్దీన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో రాచకొండ పోలీసులు అజారుద్దీన్‌పై నాలుగు కేసులు పెట్టారు. ఆగస్టు 10న హెచ్‌సీఏ నిధులపై జస్టిస్ లావు నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్ నిర్వహించింది. క్రికెట్ బంతుల కొనుగోలులో భారీ గోల్ మాల్ జరిగినట్లుగా గుర్తించింది. ఒక్కో బంతిని రూ.392 బదులుగా రూ.1400 రూపాయలకు వర్క్ ఆర్డర్ చేసినట్లు గుర్తించింది. కేవలం ఈ క్రికెట్ బంతుల కొనుగోలు విషయంలోనే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు దాదాపు 57 లక్షలు నష్టం జరిగినట్లు లావు నాగేశ్వర్‌రావు కమిటీ ఆడిట్‌ రిపోర్టులో తెలింది. బకెట్ చైర్స్ కొనుగోలులో కూడా హెచ్‌సీఏకు 43 లక్షలు నష్టం వచ్చినట్లుగా వాటిల్లినట్లు కమిటీ రిపోర్టులో పేర్కొంది.ఫైర్ ఫైటింగ్ పరికరాల పేరుతో 1.50 కోట్లు HCAకు నష్టం వచ్చింది. జిమ్ పరికరాల పేరుతో 1.53 కోట్లు నష్టం వాటిల్లింది. అజారుద్దీన్‌పై ఉప్పల్ పోలీసులు 4 కేసులు నమోదు చేశారు. ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసినప్పటి నుంచి అజారుద్దీన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది.