Sejal Suicide Attempt: ఆరిజిన్ డెయిరీ సీఈఓ బోడపాటి శేజల్ మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని పెద్దమ్మ గుడి వద్ద ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు మింగేశారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అయితే విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శేజన్ ను ఆటో ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె బ్యాగ్ లో నిద్ర మాత్రలు ఉండడంతో.. ఆమె అవే మింగేసి బలవన్మరణానికి పాల్పడినట్లు భావిస్తున్నారు. మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో ఆమెను పెద్దమ్మ గుడి వద్ద ఎవరో డ్రాప్ చేశారని స్థానికులు చెబుతున్నారు. అయితే శేజల్ ఎందుకు మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందనే విషయం గురించి మాత్రం ఇంకా ఏం తెలియరాలేదు. 


ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూమిని తన భూమి అని అమ్మడంతో పాటు లైంగికంగా తనను వేధించారని శేజల్ ఆరోపించిన విషయం అందరికీ తెలిసిందే. దాదాపు పదిహేను రోజులకు పైగా ఆరిజన్ డెయిరీ ఎండీ శేజల్ న్యూఢిల్లీలోనే ఉంటున్నారు. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆమె ధర్నాకు దిగారు. జాతీయ మహిళా కమిషన్ కు ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం జరగడం లేదని ఆవేనదతో న్యూఢిల్లీలోనే ఆత్మాహత్యాయత్నం చేయడంతో.. వెంటనే ఆమెను స్థానికులు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి నుండి  డిశ్చార్జ్ అయిన తర్వాత  ఎమ్మెల్యే చిన్నయ్యపై సీబీఐకి కూడా శేజల్ ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి ఆమె తెలంగాణ భవన్ లో నిరాహార దీక్ష చేపట్టారు. ఇదంతా జరిగి పదిహేను రోజులు కూడా కావట్లేదు. తాజాగా హైదరాబాద్ వచ్చిన ఆమె మరోసారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం సంచలనం రేపుతోంది. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్​లో నివాసం ఉండే ఆదినారాయణ గత ఏడాది ఆగస్టులో బెల్లంపల్లిలో ఆరిజిన్ డెయిరీ ప్రారంభించారు. కన్నాల శివారులో నేషనల్ హైవే 363 పక్కన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ నిర్మాణానికి ఎమ్మెల్యే చిన్నయ్య  భూమిపూజ చేశారు. యూనిట్ కోసం రెండెకరాల అసైన్డ్ భూమినీ చిన్నయ్యే ఇప్పించాడని ప్రచారం జరిగింది. బర్రెల యూనిట్లు ఇస్తామని ఆదినారాయణ, శేజల్ తమ నుంచి రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేసి మోసగించారని పలువురు పాడి రైతులు జనవరిలో నియోజకవర్గంలోని వివిధ పోలీస్​ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆదినారాయణ, శేజల్‌ను ను అరెస్ట్ చేసి ఆదిలాబాద్ జైలుకు రి తరలించారు.   బెయిల్‌పై  రిలీజైన వారు ఎమ్మెల్యే చిన్నయ్యపై ఆరోపణలు చేస్తూ వాట్సాప్ చాటింగ్ లిస్ట్ బయటపెట్టారు. డబ్బులు అడిగితే ఇవ్వనందుకే తమపై అక్రమ కేసులు పెట్టించాడని ఆరోపించారు. తనను వేధింపులకు గురిచేశాడంటూ శేజల్ సోమవారం ఓ ఆడియో రికార్డ్​ కూడా రిలీజ్ చేశారు. 


అప్పట్నుంచి తనకు న్యాయంచేయాలని శేజర్ పలు చోట్ల ఆందోళనలు చేశారు. తాజాగా మానవహక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు.అయితే  బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాత్రం  సబ్సిడీపై గేదెల యూనిట్లు ఇస్తామని చెప్పి బెల్లంపల్లి ప్రాంతంలో చాలామంది రైతుల దగ్గర రూ.3.50 లక్షల చొప్పున వసూలు చేశారు. యూనిట్లు ఇవ్వకుండా రైతులను మోసగించారు. బాధిత రైతులు నన్ను సంప్రదించడంతో డెయిరీ నిర్వాహకులను పోలీసులకు పట్టిచ్చానని చెబుతున్నారు. వారితో తనకెలాంటి సంబంధాలు లేవంటున్నారు.