Hyderabad News: రోజురోజుకూ ఆహారం కల్తీలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద నగరాల్లో చాలా మంది ఆహార పదార్థాలను కల్తీ చేస్తూ.. అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. హైదరాబాద్‌లో అయితే తరచూ చిన్న పిల్లలు తినే చాక్లెట్లు, లాలీ పప్లు, ఐస్ క్రీంలు.. కల్తీ చేస్తూ కోట్లు సంపాదిస్తున్నారు. కారం పొండి, పసుపు, అల్లం.. ఇలా అన్నింటిలోనూ కల్తీ జరుగుతోంది. గతంలో ఎన్నో సార్లు అలాంటివారిపై పోలీసులు కఠినమైన చర్యలు తీసుకున్నా, డబ్బులకు ఆశ పడుతున్న కొందరు ఆహార కల్తీని కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా కల్తీనూనె తయారు చేస్తున్న ఓ వ్యక్తి బాగోతం బట్ట బయలు అయింది. పంది కొవ్వుతో నూనె తయారు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. 


అసలేం జరిగిందంటే..?


హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్ పరిధిలోని ఆర్కేపురంలో రమేష్ శివ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇంట్లోనే గుట్టు చప్పుడు కాకుండా రమేత్ పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు. ముందుగా పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకునేవాడు. ఆ తర్వాత దాన్ని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగే కనిపించేది. ఇలా నూనె కల్తీ చేయడంతో ఆరితేరిన రమేష్.. పెద్ద ఎత్తున నూనె తయారు చేస్తున్నాడు. దాన్ని పక్కన ఉండే ఫ్రైడ్ దుకాణాల నిర్వాహకులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. అయితే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రమేష్ ఇంటిపై ఆకస్మిత తనిఖీలు నిర్వహించారు. పందికొవ్వుతో రమేష్ నూనె తయారు చేస్తున్నట్లు గుర్తించి అరెస్ట్ చేశారు. ఇతని వద్ద నూనె కొనుగోలు చేసిన పాస్ట్ ఫుడ్ దుకాణాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఇకపై అలాంటి వాళ్ల వద్ద నూనెలు కొనుగోలు చేయకూడదని సూచించారు. 


గత నెలలో కాటేదాన్ లో కల్తీ ముఠా అరెస్ట్


కాటేదాన్ లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండానే గత కొన్ని రోజులుగా గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్తీ వ్యాపారం జరుగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. మురికి ప్రాంతంలో కుళ్లి పోయిన అల్లం, వెల్లుల్లితో పేస్టును నిర్వహకులు తయారు చేస్తున్నట్లుగా గుర్తించారు. అల్లం వెల్లుల్లి పేస్టు ఘాటుగా ఉండడానికి అల్లం వెల్లుల్లి పేస్టులో అసిటిక్ యాసిడ్ తో పాటు ప్రమాద కరమైన రసాయనాలు కలుపుతున్నారు. మెషినరీలో కుళ్లి పోయిన అల్లం, వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పాయల పొట్టును కూడా కలుపుతూ పేస్ట్ తయారీ చేస్తున్నట్లు గుర్తించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కల్తీ దందా కొనసాగుతోంది. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు పరిశ్రమపై దాడి చేసి అపరిశుభ్రత, మురుగు నీరు, ప్రమాదకరమైన రసాయనిక పదార్థాలను గుర్తించారు. 500 కేజీల అల్లం, వెల్లుల్లి పేస్టు, భారీగా మ్యాంగో కూల్ డ్రింగ్, ప్రమాద కరమైన రసాయనాలు, తెల్లటి పౌడర్, 210 లీటర్ల అసిటిక్ యాసిడ్, 550 కేజీల నాన్ వెజ్ మసాల ప్యాకెట్స్, టన్ను వెల్లుల్లిని సీజ్ చేశారు.