లోలోపల కుమ్ములాటలకు కాలం చెల్లింది. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ఎవరు ఎటో తేల్చుకునే టైం వచ్చింది. అందుకే ఆయా పార్టీల్లో ఉన్న అసంతృప్త నేతలంతా బయటకు వస్తున్నారు. బీజేపీలో ఎప్పటి నుంచో అసంతృప్తిగా ఉంటున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ వైరల్‌గా మారుతోంది. తమ పార్టీ నేతలపై సెటైర్లు వేస్తూ ఆయన చేసిన పోస్ట్ ఉదయం నుంచి వైరల్‌గా మారుతోంది.
ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటూ ఓ మొరటు వీడియోను ఆయన పోస్టు చేశారు. కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. అయితే దాన్ని నెటిజన్లు ఫోటోలు తీసి వైరల్ చేశారు. ఎలాగూ విషయం బయటకు వచ్చిందని గ్రహించిన జితేందర్‌రెడ్డి మరోసారి అదే వీడియోను పోస్టు చేశారు.
ఈసారి పోస్టు చేసిన వీడియోను అగ్రనేతలందరికీ ట్యాక్ చేశారు.@blsanthosh, @BJP4India, @AmitShah, @sunilbansalbjp, @BJP4Telangana అకౌంట్స్ అన్నింటికీ తన వీడియోను ట్యాక్ చేశారు.
గత కొంత కాలంగా తెలంగాణ బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు మామూలుగాలేవు. ఏకంగా అధినాయక్వతం కొందరిని పిలిచి మాట్లాడి సర్దుబాటు చేసే ప్రయత్నం చేసింది. కానీ అలా జరిగి వారం తిరగక ముందే మరోసారి నేతల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి.
బండి సంజయ్ ప్రశ్నించేటోళ్లకే ఈ ట్రీట్మెంట్ అట
కాసేపటికే మరో ట్వీట్ చేసిన ఆయన బండి సంజయ్‌ను ప్రశ్నించేటోళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఈ ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే" కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే... బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగe అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి" అని తీవ్ర పదజాలంతో మరో ట్వీట్ చేశారు.