తెలంగాణ ఉద్యమ గాయకుడు, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ మరణంపై సీఎం కేసీఆర్‌ సహా లీడర్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సాయిచంద్ ఆకస్మిక మరణం అందర్నీ కలచి వేసింది. 39 ఏళ్లకే చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం గొప్ప గాయకున్ని, కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభ సొంతం చేసుకున్న బిడ్డ సాయిచంద్ అన్నారు. మరింత ఉన్నతస్థాయికి ఎదిగే దశలో అకాల మరణం ఎంతో బాధాకరం" అని సీఎం విచారం వ్యక్తం చేశారు. 


రాష్ట్ర సాధనలో సాగిన సాంస్కృతిక ఉద్యమంలో సాయిచంద్ పాత్ర కీలకమైనదిగా సీఎం అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ కాలంలో సాయిచంద్ పాడిన పాటలను సీఎం స్మరించుకున్నారు. సాయిచంద్ లేకుండా తన సభలు సాగేవి కావని కేసీఆర్‌ గుర్తు చేసుకొని ఆవేదన వ్యక్తం చేశారు. తన ఆట పాటతో ప్రజలలో నాడు ఉద్యమ స్ఫూర్తిని నేడు అభివృద్ధి చైతన్యాన్ని రగిలించిన తెలంగాణ బిడ్డని కోల్పోవడం తీరని లోటన్నారు సీఎం. 






శోకతప్త హృదయులైన సాయిచంద్ కుటుంబ సభ్యులు ఈ తీవ్ర విషాదాన్ని తట్టుకునే శక్తినివ్వాలని భగవంతున్ని ప్రార్థించారు సీఎం కేసీఆర్. వారి కుటుంబానికి తాము అండగా ఉంటామన్నారు. వారి కుటుంబ సభ్యలకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.


హరీష్‌రావు భావోద్వేగం 
సాయిచంద్‌తో కలిసి ఉన్న ఫొటోను ట్విటర్‌లో షేర్ చేసిన మంత్రి హరీష్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. నాడు తెలంగాణ ఉద్యమంలో లక్షల మందిని ఉర్రూతలూగించి, నేడు స్వరాష్ట్ర అభివృద్ధి విధానాన్ని పాట రూపంలో చెబుతున్న గొంతుక మూగబోయిందన్నారు. తెలంగాణ ఉద్యమ గాయకుడు, అత్యంత ఆత్మీయుడు, తమ్ముడు సాయిచంద్ మృతి అత్యంత బాధాకరమన్నారు. వ్యక్తిగతంగా, పార్టీ పరంగా తీరని లోటని పేర్కొన్నారు. సాయిచంద్ భౌతికంగా మన మధ్య లేకున్నా పాట రూపంలో, తెలంగాణ ఉద్యమంలో ఆయన పోషించిన పాత్ర రూపంలో అందరి గుండెల్లో చిరకాలం నిలిచే ఉంటారని చెబుతూ జోహార్ సాయిచంద్ అంటూ పోస్టు చేశారు. ఆసుపత్రిలో సాయిచంద్ మృతదేహాన్ని చూసిన మంత్రి హరీష్‌రావు కంటతడి పెట్టుకున్నారు. 






సాయిచంద్‌ మృతిపై కేటీఆర్‌ షాక్


చాలమందిని ఉద్యమంవైపు కదిలించిన గొంతు ఇలా ఒక్కసారిగా మూగబోవడం షాకింగ్‌గా ఉందన్నారు మంత్రి కేటీఆర్. ఆయన ఆత్మకు శాంతికలగాలని ప్రార్ధించారు.






కవిత దిగ్భ్రాంతి


రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా అంటూ తన పాటతో ఎన్నో హృదయాలను కదిలించిన సాయిచంద్ అకాల మరణం ఎంతో కలచివేసిందన్నారు ఎమ్మెల్సీ కవిత. సాయిచంద్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు.