Hyderabad News: 18 ఏళ్ల క్రితం ఇద్దరు బ్యాంకు మేనేజర్లు అక్రమాలకు పాల్పడ్డారు. హౌసింగ్ లోన్ పేరిట కోటి 15 లక్షల రూపాయల మోసానికి తెర లేపారు. అయితే ఇంతకాలానికి ఈ కేసులో నిందితులకు జైలు శిక్ష పడింది. స్థానిక సీబీఐ కోర్టు ఇద్దరు మేనేజర్లను దోషులుగా నిర్ధారించి.. వీరిద్దరికీ 75 వేల చొప్పున జరిమానాతో పాటు ఐదేళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధించింది. 


అసలేం జరిగిందంటే..?


2005 సంవత్సరంలో పిల్లేండ్ల ఫణి ప్రసాద్ బ్యాంకు ఆసిఫ్ నగర్ బ్రాంచ్ మేనేజర్‌గా, చింతకుంట్ల పాండురంగం చలపతి అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసే వారు. అదే సమయంలో ప్రైవేట్ కంపెనీ యజమాని యర్రం కోటేశ్వర రావు అనే వ్యక్తి హౌసింగ్ లోన్ తీసుకున్నాడు. ఈ క్రమంలోనే మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఇద్దరూ కోటేశ్వర రావుకు 23 గ్రూప్ హౌసింగ్ లోన్ ను మంజూరు చేశారు. అయితే తప్పుడు అడ్రెస్ లు, పత్రాలు పెట్టి కోటేశ్వర రావు మొత్తం 1.15 కోట్ల రుణం పొందాడు. రుణగ్రహీతల ఖాతాలన్నీ ఎన్‌పీఏలుగా మారడంతో బ్యాంకుకు 1.15 కోట్ల నష్టం వాటిల్లింది.


దీనిపై కేసు నమోదు చేసిన సీబీఐ.. 1.15 కోట్ల మోసానికి ఇద్దరు బ్యాంకు అధికారులతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలపై ప్రసాద్, చలపతి, ప్రైవేట్ కంపెనీ యజమాని యర్రం కోటేశ్వరరావులపై 2005 నవంబర్‌లో కేసు నమోదు చేసింది. ఈక్రమంలోనే 2007 మే 18వ తేదీన ముగ్గురు నిందితులపై చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. అయితే విచారణ జరుగుతున్న సమయంలోనే కోటేశ్వర రావు మృతి చెందాడు. అప్పటి నుంచి ఈ కేసు సాగుతూనే ఉంది. అయితే ఎట్టకేలకు సీబీఐ కోర్టు ఫణి ప్రసాద్, పాండురంగం చలపతిలను సీబీఐ కోర్టు.. దోషులుగా తేల్చింది. ఈ క్రమంలోనే వారికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. అలాగే హైదరాబాద్‌లోని సీబీఐ కేసుల ప్రత్యేక న్యాయమూర్తి వీరిద్దరికీ 75,000 చొప్పున జరిమానా విధించారు.