‘‘వాళ్లే హిందువులకు పుట్టినట్లు.. మేం ఇంకెవరికో పుట్టామన్నట్లుగా బీజేపీ వ్యవహరిస్తోంది’’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా ఆయన అసోం ముఖ్యమంత్రి లక్ష్యంగా ఈ విమర్శలు చేశారు. ఒక ముఖ్యమంత్రి గా ఉండి ఇంకో ముఖ్యమంత్రిపై వాఖ్యలు చేయడం అసోం సాంప్రదాయమా? అని ప్రశ్నించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, చెడగొట్టేందుకే అసోం సీఎం ఇక్కడికి వచ్చారా? అని నిలదీశారు. ఆయన గణేష్ ఉత్సవ సమితి కాషాయ బట్టలు వేసుకొని.. విద్వేషాలు రెచ్చగొడుతున్నారని ఆరోపించారు.


నిమజ్జన కార్యక్రమంలో హిందూ, ముస్లింల మధ్య చిచ్చు పెట్టి రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించే కుట్రలు చేశారని దానం నాగేందర్ అన్నారు. ‘‘అందుకోసం ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్ర మంత్రులు వచ్చారు. కాషాయ బట్టలు, టోపీలు పెట్టుకొని, అల్లర్లకు కుట్ర చేస్తున్నారు. అందుకే తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. మత ఘర్షణలు సృష్టించేందుకే బండి సంజయ్ భాగ్యలక్ష్మి ఆలయానికి ఈ మధ్య తరచూ వెళ్తున్నారు. 


తెలంగాణలో ఎన్నో  సంవత్సరాలుగా గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ మత సామరస్యానికి కృషి చేస్తుంటే, బీజేపీ మత ఘర్షణలు చేయాలని చూసింది. టీఆర్ఎస్ నేత నంద్ బిలాల్ వ్యాస్ ఏం తప్పు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వాఖ్యలు చేస్తే ఆయన నిరసన తెలిపారు.’’ అని దానం నాగేందర్ మాట్లాడారు.


కేసీఆర్ పై అసోం సీఎం విమర్శలు


జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కల నెరవేరదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ గణేశ్ నిమజ్జనోత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన బిశ్వ శర్మ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో మ‌రో 30 ఏళ్ల వరకు బీజేపీ అధికారంలో ఉంటుందన్న ఆయన... విప‌క్షాల‌తో క‌లిసి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాల‌న్న కేసీఆర్ క‌ల నెర‌వేర‌ద‌ని స్పష్టం చేశారు. సముద్రంలోనో, సూర్యుడి మీదో, చంద్రుడి మీదో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాల‌ని హిమంత బిశ్వ శర్మ ఎద్దేవా చేశారు. కేంద్రంలో అయితే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటు కావ‌డానికి అవ‌కాశ‌మే లేదన్నారు. దేశంలోని ప్రతిప‌క్షాల‌న్నీ క‌లిసే ఉన్నాయ‌ని, కేసీఆర్ కొత్తగా చేయాల్సిందేం లేదన్నారు.  


దానంపై ఇటీవలే నెటిజన్ల ఫైర్
ఖైర‌తాబాద్ గ‌ణేషుడి వ‌ద్ద టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చెప్పులు వేసుకొని పూజ‌లో పాల్గొనడం నెటిజన్ల ఆగ్రహం కారణం అయింది. ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల క‌విత బుధ‌వారం (సెప్టెంబరు 7) ఖైర‌తాబాద్ వినాయ‌కుడిని ద‌ర్శించుకున్నారు. ఈ సంద‌ర్భంగా ఆ గ‌ణ‌నాథుడికి ప్రత్యేక పూజ‌లు చేశారు. ఆమె వెంట అనుచ‌రులు, స్థానిక ఎమ్మెల్యే అయిన దానం నాగేంద‌ర్ కుడా ఉన్నారు. అయితే ఈ పూజ‌లో పాల్గొన్న స‌మ‌యంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకొనే ఉన్నారు. ఈ విష‌యం ఎమ్మెల్సీ క‌ల్వకుంట్ల ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా వెలుగులోకి వ‌చ్చింది. క‌విత త‌న ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా ఖైరతాబాద్ గణేషుడి ద‌ర్శనం, పూజా కార్యక్రమానికి సంబంధించిన ఫొటోల‌ను పంచుకున్నారు.


ఆ ఫొటోల్లో దానం నాగేంద‌ర్ చెప్పులు వేసుకొని ఉన్న విష‌యం స్పష్టంగా క‌నిపిస్తోంది. దీంతో నెటిజ‌న్లు ఆయ‌న‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుళ్ల ద‌గ్గర చెప్పులు ఎలా వేసుకుంటార‌ని ప్రశ్నించారు. ఈ విష‌యంలో సోష‌ల్ మీడియాలో తీవ్ర చ‌ర్చనీయాంశం అయ్యింది. క్షమాప‌ణ‌లు చెప్పాల‌ని సోషల్ మీడియాలో డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.