తెలుగు నటుడు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నేడు (సెప్టెంబరు 11) ఉదయం 3.16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. అయితే, ఆయన చనిపోవడానికి గల కారణాలను ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీనికి సంబంధించి ఏఐజీ ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. 


ఆ ప్రకటన ప్రకారం.. ‘‘ప్రస్తుతం కృష్ణంరాజుకు 82 ఏళ్లు. ఆయనకు డయాబెటిస్ ఉంది. పోస్ట్ కోవిడ్ లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో తీవ్రమైన కార్డియాక్ అరెస్ట్‌ రావడంతో చనిపోయారు. అంతేకాకుండా చాలా కాలంగా గుండె కొట్టుకునే వేగం విషయంలో సమస్య ఎదురవుతోంది. అందుకోసం చికిత్స తీసుకుంటున్నారు. ఒంట్లో రక్తప్రసరణ సరిగా లేకపోవడంతో గత సంవత్సరం ఆయన కాలికి ఓ ఆపరేషన్ కూడా జరిగింది. 


మరోవైపు, కిడ్నీలు, ఊపిరితిత్తుల ఇబ్బందులతోనూ కృష్ణంరాజు బాధపడుతూ ఉన్నారు. కిడ్నీ పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో ఆస్పత్రిలో చేరిన నాటి నుంచి వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి గమనిస్తూ ట్రీట్మెంట్ అందించారు. పోస్ట్ కోవిడ్ లక్షణాలతో గత నెల 5వ తేదీన కృష్ణంరాజు హాస్పిటల్‌లో చేరారు. ఆ సమయంలో ఊపిరితిత్తుల్లో న్యూమోనియా ఉంది. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఊపిరితిత్తుల్లో న్యూమోనియో తలెత్తినట్లుగా వైద్యులు గుర్తించారు. ఆదివారం (సెప్టెంబరు 11) తెల్లవారుజామున 3.16 గంటలకు తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు చనిపోయారు’’ అని ఆస్పత్రి యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది.


ఆదివారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత కృష్ణంరాజు పార్థివదేహాన్ని ఆయన సొంత ఇంటికి ఇంటికి తీసుకు వస్తారని తెలుస్తోంది. ఆ తర్వాత సినీ రాజకీయ ప్రముఖుల సందర్శనకు అనుమతించనున్నారు. సోమవారం మధ్యాహ్నం దాటాక అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.