Satyavathi Rathore: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రతి విషయంలో అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని.. మంత్రి సత్యవతి రాథోడ్ విమర్శించారు. బయ్యారంలో ఉక్కుఫ్యాక్టరీ సాధ్యం కాదని ఆయన చేసిన ప్రకటనను ఖండిస్తున్నామని చెప్పారు. మాజీమంత్రి, ఎమ్మెల్యే రెడ్యా నాయక్, ఎంపీ మాలోత్ కవితతో కలిసి టీఆర్ ఎస్ ఎల్పీ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు.
బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు
మంత్రి రాథోడ్ మాట్లాడుతూ.. బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెడతామని అప్పటి యూపీఏ ప్రభుత్వం పునర్విభజన చట్టంలో హామీ ఇచ్చిందని అన్నారు. అలాంటిది ఇప్పుడు కిషన్ రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఇది కిషన్ రెడ్డి మాటా.. లేకపోతే కేంద్రప్రభుత్వం మాట అనేది స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు అని మంత్రి అన్నారు. ఎన్నో ఆందోళనల తర్వాత బయ్యారం ఉక్కు ప్యాక్టరీ నెలకొల్పుతామనే హామీ వచ్చిందన్నారు. 2006లో రక్షణ స్టీల్స్ కు బయ్యారం గనులు కేటాయిస్తే నిరసనలు వ్యక్తమైతే అప్పటి ప్రభుత్వం నిర్ణయాన్ని రద్దు చేసుకుందని గుర్తుచేశారు.
కిషన్ రెడ్డి ప్రకటన తెలంగాణపై పిడుగుపాటు లాంటిదని మంత్రి అన్నారు. ఆయన కేంద్రమంత్రి అయ్యాక తెలంగాణకు ఉపయోగపడే ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి ఉత్సవ విగ్రహంలా మారారని.. ఆయన పదవి అలంకార ప్రాయమని వ్యాఖ్యలు చేశారు. వెంటనే ఆ ప్రకటనను వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి చిత్తశుద్ధి లేదు
బీజేపీకి గిరిజనులంటే గిట్టదని ఎంపీ మాలోత్ కవిత మండిపడ్డారు. ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు 8 ఏళ్ల తర్వాత పెట్టమని చెప్తే ఎలా అని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల బీజేపీకి చిత్తశుద్ధి లేదని విమర్శించారు. కిషన్ రెడ్డి తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిదేళ్లలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ కోసం ఒక్క మంచి పనైనా చేసిందా అని ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ప్రశ్నించారు. ఏ మొహం పెట్టుకుని బీజేపీ నేతలు తెలంగాణ ప్రజలను ఓట్లు అడుగుతారని విమర్శించారు. తక్షణమే పునర్విభజన చట్టం హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.