గచ్చిబౌలిలోని కొత్తగూడా జిహెచ్ఎంసి పార్కులో సాయంత్రం అయితే చాలు చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్లంతా వాకింగ్‌కు వస్తుంటారు. ఇవాళ కూడా అలానే చాలా మంది జనం వాకింగ్‌కు వచ్చారు. ఇంతలో అక్కడ సడెన్‌గా అలజడి రేగింది. ఏం జరిగిందని చూస్తే వాకింగ్ చేసుకుంటున్న మహిళ మెడలోంచి చైన్ లాక్కొని ఓ వ్యక్తి పారిపోతున్నాడు.
చైన్ లాక్కొని పారిపోతున్న వ్యక్తిని అక్కడి వారంతా అలర్టై పట్టుకున్నారు. మహిళ మెడలోని చైన్స్ కొట్టేయడం ఏంట్రా అంటూ చితక్కొట్టేశారు. వారి కసినంతా చూపించిన తర్వాత పోలీసులకు ఫోన్ చేసి అసలు విషయం చెప్పారు.
గచ్చిబౌలి పోలీసులు వచ్చిన తర్వాత అక్కడి వారికి చిక్కిన దొంగను అరెస్టు చేశారు. అతని వివరాలు ఆరా తీస్తే పోలీసులు బిత్తరపోయారు. చైన్ దొంగతనం చేస్తూ చిక్కిన వ్యక్తి తమ డిపార్ట్‌మెంట్ వాడే అని తెలిసి కంగారు పడ్డారు. అయితే మద్యానికి బానిసై విధుల నుంచి సస్పెండ్ అయిన కానిస్టేబుల్ రమేష్‌గా తెలుసుకున్నారు.
టిఎస్‌ఎస్‌పి కానిస్టేబుల్ రమేష్ సస్పెండ్ అయిన తర్వాత ఇలాంటివి చేస్తున్నట్టు డిపార్ట్‌మెంట్‌లో టాక్ నడుస్తోంది. గతంలో ఇంకా వేరే ప్రాంతాల్లో ఏమైనా కేసులు ఉన్నాయా అన్న కోణంలో గచ్చిబౌలి పోలీసులు విచారణ చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అతన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.