Hyderabad News: హైదరాబాద్ లోని ఖైరతాబాద్ చింతల్ బస్తీలో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఇద్దరు మహిళలను.. సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. వారు పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా.. మతిస్తిమితం లేనట్లు ప్రవర్తిస్తున్నట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే
ఈ ఉదయం ఖైరతాబాద్ చింతల్ బస్తీలో ప్రతిష్టించిన అమ్మవారి విగ్రహానికి పూజారి పూజ చేస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు మహిళలు మండపం లోనికి వచ్చారు. పూజారి వారిస్తున్నా వినకుండా తమతో తెచ్చుకున్న రాడ్డుతో అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న వెంకటేష్ అనే భక్తుడు వారిని అడ్డుకోవటానికి ప్రయత్నించటంతో అతనిపై దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయారు.
అనంతరం ఆ మహిళలు అదే బస్తీలో ఉన్న మరియమాత విగ్రహాన్నికూడా ధ్వంసం చేశారు. ఇంతలో స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారి వద్ద నుంచి రాడ్, చాకు, ఆయిల్, సర్ఫ్ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.
దీని గురించి సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ వివరాలు తెలియజేశారు. ఆ ఇరువురు మహిళలకు మతిస్తిమితం సరిగ్గా లేదని చెప్పారు. వారి సోదరుడు స్టేషన్ కు వచ్చి వివరణ ఇచ్చాడని.. ఆ ఇద్దరు మహిళలు సైపోతెమియా అనే వ్యాధితో బాధపడుతున్నారని డీసీపీ తెలిపారు. వారి మెడికల్ రిపోర్ట్స్ తనిఖీ చేస్తున్నామని వెల్లడించారు. ఇరుగుపొరుగు వారిని విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నామని చెప్పారు. 4 సంవత్సరాలు క్రితం కూడా వారు ఇలాగే ప్రవర్తించారని చెప్పారు. దీనిపై వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. ఇద్దరు మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించి.. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తామని వివరించారు. కేసు నమోదు చేశామని.. పూర్తిగా దర్యాప్తు చేస్తామని స్పష్టంచేశారు.