Nayeem Follower Sheshanna: గ్యాంగ్ స్టర్ నయీమ్ ప్రధాన అనుచరుడు శేషన్నను అరెస్ట్ చేసిన హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు.. విచారణను కొనసాగిస్తున్నారు. అయితే ఇన్నాళ్లూ అజ్ఞాతంలో ఉన్న శేషన్న ఆయుధాలు అమ్మినట్లు పోలీసులు తెలుసుకున్నారు. హైదారబాద్ లో ముగ్గురికి ఆయుధాలు ఇచ్చినట్లు గుర్తించి... వారిలో ఒకరైన అక్బర్ అనే వ్యక్తిని పట్టుకున్నారు. అతడు ఇచ్చిన సమాచారం ఆధారంగానే శేషన్నపై నిఘా పెట్టారు. కొత్తపేటలోని ఓ హోటల్ లో ఉన్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో అక్కడకు వెళ్లిన పోలీసులు శేషన్నను అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 9 ఎంఎం పిస్టల్ ను కూడా స్వాధీనం చేసుకున్నారు. 


నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత అజ్జాతంలోకి వెళ్లిన శేషన్న..


నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత శేషన్న అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడరు. 2018లో శేషన్నను పట్టుకుని తీరుతామని డీజీపీ మహేందర్‌ రెడ్డి ప్రకటించినా... పోలీస్‌ నిఘాకు చిక్కకుండా శేషన్న తప్పించుకు తిరుగుతున్నాడు. నయీమ్ ఎన్‌కౌంటర్‌ తర్వాత ప్రధాన అనుచరులైన శేషన్న, రామయ్య, జహంగీర్‌ మాయమయ్యారు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన శేషన్న మావోయిస్టు పార్టీలో చేరిన సమయంలోనే నయీంతో పరిచయం ఏర్పడింది. పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి సొంతంగా గ్యాంగ్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఉమ్మడి నల్లగొండ కేంద్రంగా ప్రారంభమైన నయీం గ్యాంగ్‌ అరాచకాలు శేషన్నకు పట్టుఉన్న మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఎక్కువగా చోటు చేసుకున్నాయి. బెదిరింపులు, కిడ్నాప్‌లు, వసూళ్లు, మాట వివని వారిని మట్టుబెట్టేవారు. నయీం టార్గెట్‌ ఫిక్స్‌ చేస్తే శేషన్న పక్కాగా ప్లాన్‌ వేసి అమలు చేసేవాడు. నయీం నేర సామ్రాజ్యానికి శేషన్న సైన్యాధికారిగా వ్యవహరించేవాడు. నయీం చేసే ప్రతి పనిలోనూ శేషన్న ప్రమేయం ఉండేది. దీంతో నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత పరారీలో ఉన్న శేషన్నకోసం పోలీస్‌లు తీవ్రంగా ప్రయత్నించడంతో కర్నూలు జిల్లాలోని మాజీ మావోయిస్టు వెంకట్‌ రెడ్డి ఆశ్రయం కల్పించినట్లు ఇటీవలే గుర్తించారు. పోలీస్‌లకు తన జాడ తెలిసిందనే విషయం పసిగట్టిన శేషన్న, అతనికి ఆశ్రయం కల్పించిన వెంకట్‌ రెడ్డి పరారయ్యారు.


ఇప్పటికీ కొనసాగుతున్న కేసు..


నయీమ్ కేసుల దర్యాప్తులో ఇప్పటి వరకు అతని కుటుంబ సభ్యులు, గ్యాంగు సభ్యుల్ని అరెస్ట్ చేసినప్పటికీ ప్రధాన అనుచరుడు, నయీం అరాచకల్లో అత్యంత కీలకంగా వ్యవహరించిన శేషన్నకు సంబంధించి పోలీస్ దర్యాప్తు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో శేషన్నను త్వరలో పట్టుకుంటామని డీజీపీ అప్పట్లో తెలిపారు. ఇక నయీమ్ కేసులో కేవలం ఆరోపణలు, విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రముఖుల పేర్లు కొందరు వెల్లడించిన ప్రకారం ముందుకు వెళ్లడం కుదరదన్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఆధారాల మేరకు నయీమ్ తో  అంటకాగిన ప్రతి ఒక్కరిపై చర్యలు తప్పవని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. నయీం బాధితులకు చట్ట ప్రకారం న్యాయం జరుగుతుందని, వాస్తవానికి నయీం పోలీస్ కాల్పుల్లో మృతి చెందడంతోనే బాధితులకు న్యాయం జరిగిందని డీజీపీ అప్పట్లో  వ్యాఖ్యానించారు. కాగా గ్యంగా స్టర్ సయీం కేసుల్లో ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్) రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 197 కేసులు నమోదు చేసింది. నయీమ్ ఎన్ కౌంటర్ తర్వాత ఎక్కడికక్కడ అతని అనుచరుల్ని అరెస్ట్ చేశారు. 


హైదరాబాద్, సైబరాబాద్, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్ తోపాటు ఇతర ప్రాంతాల్లో నమోదైన 197 కేసుల్లో 125 మంది నయీం అనుచరుల్ని అరెస్ట్ చేశారు. ఆయా కేసులకు సంబంధించి అప్పటికే న్యాయస్థానాల్లో 18 చార్జిషీట్లు దాఖలు చేశారు. మరికొన్ని కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదులు, నయీంతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ రాజకీయ నాయకులు, ప్రస్తుత, మాజీ పోలీస్ అధికారులు సిబ్బందితోపాటు మొత్తంగా 878 మంది నుంచి సిట్ వాంగ్మూలాలు సేకరించింది. 107 మంది నిందితుల్ని కస్టడీకి తీసుకుని విచారించిన సిట్ వారి నుంచి నయీం గ్యాంగ్ కార్యకలా పాలకు సంబంధించిన సమాచారాన్ని రాబట్టింది. గ్యాంగ్ స్టర్ నయీం కేసుల్లో పలువురు నిందితులపై పీడీ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.