OldCity Murder: నిత్యం తాగొచ్చి ఇష్టారీతిగా కొట్టే భర్తను ఆ భార్య బెదిరించింది. తన మేనమామకు చెప్తానని, చంపేయిస్తానని హెచ్చరించింది. అలా అయినా అతనిలో మార్పు వస్తుందని ఆశ పడింది ఆ ఇల్లాలు. అలా బెదిరిస్తే అయినా వేధింపులు ఆపుతాడనుకుంది. కానీ తానొకటి తలిస్తే.. విధి మరొకటి తలిచినట్లు అయింది ఆమె పరిస్థితి. చంపేస్తామని బెదిరిస్తే భయపడిపోతాడనుకుంది, కానీ అతడు తన మేనమామనే చంపేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఈ హత్య కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ట్విస్టు ఏమిటంటే.. మహారాష్ట్రలో హత్యాయత్నం కేసులో పరారైన నిందితులు కూడా ఇదే కేసులో దొరికారు. 


జుబేర్, జరీనా బేగం మధ్య తరచూ గొడవలు..


పహడీ షరీఫ్ లో ఉండే మహ్మద్ జుబేర్, జరీనా బేగం ప్రేమించుకున్నారు. 2014 లో పెళ్లి చేసుకున్నారు. మహ్మద్ జుబేర్ ఓ రౌడీ షీటర్. రాజేంద్ర నగర్ ఠాణాలో రౌడీషీట్ కేసు కూడా ఉంది. కొంత మంది యువకులతో గ్యాంగ్ ఏర్పాటు చేసుకున్నాడు. మహ్మద్ జుబేర, జరీనా బేగం మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. జుబేర్ తాగొచ్చి జరీనాను తీవ్రంగా కొట్టే వాడు. భర్త వేధింపులు తాళలోని జరీనా.. తన మేనమామకు చెబుతానంటూ బెదిరించింది. జరీనా  బేగం మేన మామ మహ్మద్ బాబూఖాన్ కూడా రౌడీ షీటరే. అతని పేరు పైనా రౌడీ షీట్ ఉంది. కొంత కాలంగా మహ్మద్ జుబేర్, మహ్మద్ బాబూఖాన్ ల మధ్య ఆర్థిక లావాదేవీల్లో గొడవలు జరుగుతున్నాయి. రెండు గ్యాంగ్ ల మధ్య తరచూ కొట్లాట జరుగుతుండేది. ఇద్దరి అనుచరులు హత్యకు గురయ్యారు. మహ్మద్ జుబేర్ వేధింపులు భరించలేని భార్య జరీనా బేగం పుట్టింటికి వెళ్లింది. భర్త ఫోన్ చేయడంతో.. కోపంలో తన మేనమాన బాబూఖాన్ కు చెప్పి నిన్న ఈ లోకంలో లేకుండా చేస్తానంటూ, లేపేస్తా అంటూ బెదిరించింది. ఇది మనసులోనే పెట్టుకున్న జుబేర్... ఈ నెల 14వ తేదీన హస్సన్ నగర్ సలీమా హోటల్ వద్ద ఉన్న బాబూ ఖాన్ పై తన గ్యాంగ్ తో కలిసి దాడి చేశాడు. కత్తులతో, ఇనుప రాడ్లతో తీవ్రంగా కొట్టి బాబూ ఖాన్ ను చంపాడు. బాబూ ఖాన్ భార్య తన భర్తను హత్య చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది.


రాహుల్ రాజు అలియాస్ రాఖీ..


మహారాష్ట్రలోని అమరావతికి చెందిన రాహుల్ రాజు తడాస్ అలియాస్ రాఖీ కూడా ఈ కేసులో ఏ2 గా ఉన్నాడు. పోలీసులు అతడిని కూడా పట్టుకున్నారు. కేసు దర్యాప్తులో రాహుల్ రాజు అలియాస్ రాఖీ మహారాష్ట్రలో ఏప్రిల్ లో శివసేన నేత యోగేష్ గారాటి మీద తుపాకీతో కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుండి పరారై.. హైదరాబాద్ కు చేరుకున్నాడు. తనకున్న పాత పరిచయాలతో జుబేర్ గ్యాంగ్ లో చేరాడు. ఇప్పుడు జరిగిన హత్య కేసులో తను ఏ2 గా ఉన్నాడు. మహారాష్ట్ర బరువు పోలీస్ స్టేషన్ లో రాఖీపై ఐదు క్రిమినల్ కేసులు ఉన్నాయి. పాతబస్తీలో జరిగిన హత్యా కేసులో మొత్తం ఆరుగురు పాల్గొన్నారు.