మాజీ ఎంపీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో కీలక సూత్రదారి శివశంకర్ రెడ్డి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ శివశంకర్ రెడ్డి ఇదే కేసులో అరెస్టు అయి జైలులో ఉన్నాడు. బెయిల్ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించిన సందర్భంలో ఆయనే కీలక వ్యక్తి (కింగ్‌పిన్‌) అని వ్యాఖ్యానిస్తూ సుప్రీంకోర్టు బెయిల్‌ పిటిషన్‌ను తిరస్కరించింది. జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ కృష్ణ మురారిలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. గతంలో ఈయన బెయిల్ కోసం ఏపీ హైకోర్టుకు వెళ్లారు. ఇక్కడ బెయిల్ రాకపోవడంతో శివశంకర్‌రెడ్డి సుప్రీంకోర్టుకు వెళ్లగా, ఇప్పుడు అక్కడ కూడా నిరాశ ఎదురైంది. 


వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న వ్యక్తి అరెస్టు అయిన 90 రోజుల్లోనే బెయిల్ పొందారు. అలాంటిది శివశంకర్ రెడ్డి పేరు ఎఫ్ఐఆర్ లో లేదు. 2021 అక్టోబరు 26న దాఖలు చేసిన ఛార్జిషీట్‌లోనూ శివశంకర్ రెడ్డి పేరు లేదు. కాబట్టి, బెయిల్ మంజూరు చేయాలని శివశంకర్ రెడ్డి తరపు న్యాయవాది అభిషేక్ మనుసంఘ్వి కోర్టును కోరారు. దీంతో జస్టిస్‌ ఎం.ఆర్‌.షా జోక్యం చేసుకుని.. ‘‘ఈ కేసులో ప్రధాన నిందితుడు ఎ-1 కాదు. శివశంకర్‌ రెడ్డే’ అని చెప్పారు. న్యాయవాది స్పందిస్తూ.. అది కేవలం అక్కడక్కడా వినిపిస్తున్న మాట తప్పితే ఇప్పటివరకూ శివశంకర్‌ రెడ్డి పేరును ఎవరూ చెప్పలేదని అన్నారు. కానీ ఇక్కడ నేరం చేసిన ఎ-1 బెయిల్‌ మీద బయటికొచ్చారు. ఎ-4గా ఉన్న అప్రూవర్‌కు సీబీఐ కల్పించిన ప్రయోజనం వల్ల ముందస్తు బెయిల్‌ వచ్చింది. ఎక్కడా పేరులేని శివశంకర్‌రెడ్డి 11 నెలల నుంచి జైల్లో ఉన్నారు.’’ అని కోర్టుకు న్యాయవాది తెలిపారు. 


సాక్ష్యాల తారుమారుకు అవకాశం
న్యాయమూర్తి స్పందిస్తూ.. శివశంకర్ రెడ్డి చాలా పలుకుబడి కల వ్యక్తి, సాక్ష్యాలను మార్చేసే అవకాశాలు బాగా ఉన్నాయని అన్నారు. అయితే, శివశంకర్ రెడ్డి ఎవరికో డబ్బులు ఇచ్చారన్నది ప్రధాన ఆరోపణ అని, ఆ నిజానిజాలు ట్రయల్‌ కోర్టులో తేలుతుందని చెప్పారు. గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల్లోనూ తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు చెప్పింది. హైకోర్టు తీర్పులో నిందితుడి బెయిల్ కు నిరాకరిస్తున్నామని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించారు. శివశంకర్‌రెడ్డి ఇందులో లేరని మేం నమ్మడం లేదని, ఆయనే ఇందులో కింగ్‌పిన్‌ అని జస్టిస్‌ ఎం.ఆర్‌.షా అన్నారు. ఏదో ఒక ఊరట ఇవ్వాలని కోరగా, అందుకు కూడా న్యాయమూర్తి తిరస్కరిస్తూ విచారణ ముగించారు.


సుప్రీంకోర్టు తీర్పులోని ముఖ్యమైన అంశాలు ఇవీ..



  • పిటిషనర్‌ అయిన శివశంకర్ రెడ్డి సాక్షులను, సాక్ష్యాలను ప్రభావితం చేయగల రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తి.

  • పోలీసు రికార్డుల ప్రకారం అతనిపై 31 క్రిమినల్‌ కేసులు ఉన్నాయి. దీన్నిబట్టి నిందితుడి నేర చరిత్ర అర్థం అవుతోంది.

  • ఇలాంటి టైంలో బెయిల్‌ ఇస్తే విచారణపై ప్రభావం పడుతుంది.

  • శివశంకర్‌రెడ్డి సూచనల మేరకే వివేకానందరెడ్డి హత్యకు కుట్ర చేశారని.. హత్యకు నెలరోజుల ముందే ఇతర నిందితులకు భారీ మొత్తం ముట్టజెప్పారనేది ప్రధాన ఆరోపణలు.

  • 2019 మార్చి 15న హత్య జరిగిన రోజు ఉదయం 6.30 గంటలకు శివశంకర్ రెడ్డి వివేకానందరెడ్డి ఇంటికి వెళ్లినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

  • మృతుడు గుండెపోటుతో మరణించినట్లుగా ప్రచారం చేసినట్లు తెలుస్తోంది.

  • అలాగే బెడ్ రూం, బాత్రూం శుభ్రం చేయడంలో, వివేకానందరెడ్డి గాయాలకు బ్యాండేజీలు వేయడంలో సాయం చేశారు.

  • ఎ-4గా ఉన్న షేక్‌ దస్తగిరికి ఫోన్‌ చేసి స్నేహితుడు తన పేరు, ఇతరుల పేర్లను సీబీఐ ముందు చెప్పొద్దని ఆదేశించినట్లు ఆరోపణలు ఉన్నాయి