Vijayashanti on CM KCR: తెలంగాణ ప్రభుత్వంపై బీజేపీ నేత విజయశాంతి మరోసారి తనదైన శైలిలో విమర్శలు చేశారు. ఈసారి ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. కొద్ది రోజుల్లో దసరా, బతుకమ్మ పండుగలు ఉన్నందున ఈ నెల అయినా సమయానికి జీతాలు వేస్తారా? అని ప్రశ్నించారు. ఈ విషయంపైనే ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతోందని విజయశాంతి అన్నారు. ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తూ ఉంటే.. అక్టోబర్‌లోనూ అలాగే లేట్ అయితే పండుగలకు పైసలెట్ల? అంటూ ప్రశ్నించారు. విజయశాంతి ఫేస్ బుక్ ద్వారా ఈ విమర్శలు చేశారు.


‘‘తెలంగాణ ఉద్యోగులకు (Telangana Government Employees) కేసీఆర్ సర్కార్ పండగపూట కూడా పైసలు ఇచ్చేలా లేదు. అక్టోబర్ 3న బతుకమ్మ, 5న దసరా పండుగలున్నయి. కానీ, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల టెన్షన్ పట్టుకుంది. సరైన సమయానికి వేతనాలు వస్తాయా? లేవా? అనే ఆందోళనలో ఉద్యోగులున్నరు. ఈ విషయంపైనే ఆర్థికశాఖ మల్లగుల్లాలు పడుతోంది. గతేడాది కూడా పండుగ తర్వాతే జీతం జమ అయ్యింది. ప్రతి నెలా జీతాలు ఆలస్యమవుతునే ఉన్నయి. అక్టోబర్ మొదటివారంలోనే బతుకమ్మ, దసరా పండుగలు ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో టెన్షన్ మొదలైంది. 


ప్రతి నెలా ప్రభుత్వం ఆలస్యంగా వేతనాలు జమ చేస్తుండటంతో.. అక్టోబర్‌లోనూ అలాగే లేట్ అయితే... పండుగలకు పైసలెట్ల? అనే ఆందోళన మొదలైంది. కనీసం వచ్చే నెలలో అయినా ఒకటో తేదీకి జీతాలొస్తే పండుగ షాపింగ్ చేయొచ్చనే ఆలోచనలో ఉన్నరు. కానీ వేతనాలను ప్రభుత్వం ముందుగానే జమ చేస్తుందా? లేదా ఎప్పటిలాగే ఆలస్యంగా అందిస్తుందా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఏం కేసీఆర్... ఉద్యోగులతో ఇంకెన్ని రోజులు ఈ ఆటలు? త్వరలో సర్కారీ ఉద్యోగులే... కేసీఆర్ సర్కార్‌ను పడగొట్టడం ఖాయం.’’ అని విజయశాంతి ఫేస్ బుక్, ట్విటర్ వేదికగా స్పందించారు.



ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టుపై స్పందన (MLA Raja Singh News)
మరోవైపు, కేసీఆర్ తనకి నచ్చనివారిపై ఏ విధంగా కక్ష తీర్చుకుంటారనే దానికి ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ వ్యవహారం ఒక ఉదాహరణ అని విజయశాంతి అన్నారు. దాదాపు నెల రోజులుగా చర్లపల్లి జైల్లోనే రాజాసింగ్‌ను ఉంచారని ఆయనకి ప్రాణహాని ఉందని అన్నారు. ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలంటూ ఆయన సతీమణి హైకోర్టుకు వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఈ ప్రభుత్వం ఏ స్థాయిలో పగ తీర్చుకుంటుందో అర్థమవుతోందని విజయశాంతి ఆరోపించారు. 


రాజాసింగ్ (Raja Singh) జైల్లోనే ఉన్నా ఆయన ఇప్పటికీ ఎమ్మెల్యేనే అని ప్రభుత్వం గుర్తించకపోవడం టీఆర్ఎస్ ప్రభుత్వ నైజానికి నిదర్శనమని అన్నారు. జైల్లో రాజాసింగ్‌ను కలిసేందుకు నియోజక ఓటర్లు, పౌరుల ములాఖత్‌కు జైలు అధికారులు అనుమతి ఇవ్వకపోవడం హక్కులను కాలరాయడం తప్ప మరొకటి కాదన్నారు. రాజాసింగ్ విడుదల కోసం ఇక్కడివారేగాక మహారాష్ట్రలో సైతం ప్రజలు ర్యాలీలు తీస్తున్నారని విజయశాంతి చెప్పారు. రాజాసింగ్‌ను కలుసుకునేందుకు ప్రజలకున్న హక్కును గుర్తించని పాలకులకు రాష్ట్రాన్ని పరిపాలించే హక్కు లేనే లేదని రాములమ్మ విమర్శించారు.