తెలంగాణ పాదయాత్ర చేస్తూ హాట్ కామెంట్స్‌తో పొలిటికల్ హీట్ పుట్టిస్తున్న వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి ఫైర్ అయ్యారు. తెలంగాణలో షర్మిల అనవసరమైన న్యూసెన్స్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కాళ్లు చేతులు కొట్టుకున్నా తెలంగాణలో గెలవలేరని విమర్శించారు.
తెలంగాణలో ఎలా గెలవాలో బీజేపీకి అర్థం కావడం లేదన్నారు జగ్గారెడ్డి. ఇప్పుడు పోటీ టీఆర్‌ఎస్ కాంగ్రెస్ మధ్య ఉందని అభిప్రాయపడ్డారు. కానీ అనవసరమైన కామెంట్స్ షర్మిల చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమ్మాయి కదా అని ఏం అనలేక పోతున్నామన్నారు. అందులోనూ తమ నాయకుడు వైఎస్ బిడ్డ కదా అని ఆలోచనామని కూడా అభిప్రాయపడ్డారు. అసలు తనతో షర్మిలకి పంచాయితీ ఏందో అర్థం కావడం లేదన్నారు జగ్గారెడ్డి.
షర్మిలకు ఇప్పుడు అర్జెంట్‌గా ఎక్కడో సీఎం అయిపోవాలనే కోరిక బలంగా ఉందని ఎద్దేవా చేశారు జగ్గారెడ్డి. జగన్‌తో మాట్లాడి ఆమె కోరిక తీర్చేయాలని విజయలక్ష్మికి ఓ సలహా ఇచ్చారు. అంతేకానీ మీ ఇంటి పంచాయితీని జనంపై రుద్దకండి అని సూచన చేశారు. అక్కడి సఎంల పంచాయితీల కోసం ఇక్కడ గొడవలు పెట్టొద్దన్నారు. ఎలాగో ఏపీలో మూడు రాజధానుల పంచాయితీ నడుస్తోందని... దానికి బదులు మూడు రాష్ట్రాలు చేసుకుంటే వైఎస్ ఇంటి సమస్య తీరిపోతుందన్నారు. ఎలాగో మోదీకి జగన్ గులాం అయ్యారని ఫ్యామిలీ మొత్తం మోదీ వద్ద కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు. అమరావతికి జగన్ సీఎం అయితే.. కడప, కర్నూలుకు షర్మిల, వైజాగ్‌కి విజయసాయిరెడ్డి సీఎంగా చేసుకోవచ్చని సెటైర్లు వేశారు.
ఏదో చుట్టరికం తోక పట్టుకొని తాను కేటీఆర్ కోవర్ట్ అంటూ షర్మిల తనపై నింద వేశారన్నారు. గతంలో తమ పార్టీ వాళ్లు కూడా ఇలాంటి విమర్శలు చేశారని గుర్తు చేశారు. అది ఇప్పుడు తనకు శాపమైందన్నారు. కేటీఆర్ అపాయింట్‌మెంట్ కూడా తనకు దొరగడం లేదన్నారు. ఈ అంశంలో తన పార్టీ వాళ్లే బద్నాం చేశారని ఆవేదన్ వ్యక్తం చేశారు.
తాను అన్ని మతాలకు సమన్వయకర్తనని... షర్మిల లెక్క బీజేపీకి ఏజెంట్‌ను మాత్రం కాదన్నారు జగ్గారెడ్డి. తనపై మళ్లీ మళ్లీ విమర్శళు చేస్తే మాత్రం చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుందని హెచ్చరించారు. తాను టీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడు కూడా పులి లెక్కే ఉన్నానని... మున్సిపల్ ఎన్నికల్లో పోలీసులు అరెస్ట్ చేస్తే రిగ్గింగ్ చేసి మూడు మున్సిపాలిటీలు గెలిపించానన్నారు. ఆ దమ్ము చూసే వైఎస్ తనను కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారని గుర్తు చేశారు. వైఎస్‌కి నచ్చిన నేను.. షర్మిలకు నచ్చలేదు అంటే ఆమెకు రాజకీయ పరిజ్ఞానం లేదని విమర్శించారు.
నోరు అదుపులో పెట్టుకో షర్మిలా అంటూ ఘాటుగా హెచ్చరించారు జగ్గారెడ్డి. వైఎస్ మోతుబరి కానీ షర్మిల కాదన్నారు. శత్రువు వచ్చినా ఆత్మీయత చూపెడతారన్నారు. వైఎస్ గుణాలు షర్మిలకు లేనేలేవని తేల్చేశారు. షర్మిల లెక్క చిల్లర ముచ్చట్లు వైఎస్ దగ్గర లేవన్నారు. తనను వ్యభిచారి అన్న షర్మిలకు అదే మాట తాను అంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. కేరెక్టర్ గురించి మాట్లాడొద్దని షర్మిలకు వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి అంటే ఊరుకోను అన్నారు. పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా... ఏం తమాషాలు చేస్తున్నావా ..? బుద్ది ఉందా నీకు.... ఆడపిల్ల ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు అన్నారు. మళ్ళీ నోరు జారితే నీ గురించి చాలా విషయాలు చెప్తానంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. చాలా డెప్త్ విషయాలు మాట్లాడాల్సి ఉంటుందన్నారు. అందరికీ బలహీనతలు ఉంటాయని అన్నీ చెప్తానంటూ కన్నెర్ర చేశారు.