Chain Snatching Gang Arrest: వరుస చైన్ స్నాచింగ్ లతోపాటు హత్యలకు పాల్పడ్డ ముఠాను హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు కోనేటి జ్ఞానేశ్వర్ ను, మరో నిందితుడు నీలం శ్రీనివాస్ ఇద్దరిని అరెస్టు చేశారు. జల్సాలు, షేర్ మార్కెట్ లో పెట్టుబడి పెట్టేందుకు ఈ ఇద్దరు నిందితులు వరుసగా చైన్ స్నాచింగ్ లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దరు నిందితులపై గతంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. 


నిందితుల్లో ఒకరు అయిన కోనేటి జ్ఞానేశ్వర్ స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు. 2019లో కోనేటి జ్ఞానేశ్వర్ పై కిడ్నాప్ కేసు నమోదు అయింది. జ్ఞానేశ్వర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుండగా.. ఓ బాలికను ఎత్తుకెళ్లాడు. అయితే ఈ కేసులో కోనేటి జ్ఞానేశ్వర్ ను పోలీసులు పట్టుకున్నారు. తర్వాత 2021వ సంవత్సరంలో ఖమ్మం జిల్లా పాల్వంచలో ఎన్డీపీఎస్ కేసులో (గంజాయి) ఇతడు అరెస్టు అయ్యాడు. 


 జైల్లో పెరిగిన స్నేహం..


మరో నిందితుడు నీలం శ్రీనివాస్ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. 8వ తరగతి వరకు చదివాడు. 2000 సంవత్సరంలో భూ వివాదం కారణంగా  అన్నయ్య వెంకటేశ్వర్లును ఇంటి పక్కనే ఉన్న చందు అనే వ్యక్తి హత్య చేశాడు. ఆ తర్వాత 2004లో తన సోదరులతో కలిసి చందును హత్య చేశాడు. నిందితుడు కోనేటి జ్ఞానేశ్వర్ ఎన్డీపీఎస్ (గంజాయి) కేసులో ఖమ్మం జైలులో ఉన్నప్పుడు నీలం శ్రీనివాస్ కూడా అదే జైలులో ఉన్నాడు.


ఇద్దరూ అక్కడ కలుసుకుని స్నేహం పెంచుకున్నారు. జైలు నుంచి విడుదల అయ్యాక. మే 2022 నెలలో, నీలం శ్రీనివాస్, జ్ఞానేశ్వర్ స్వగ్రామానికి వెళ్లారు. అక్కడ వారి ఆర్థిక సమస్యలు, రోజు వారీ ఖర్చుల గురించి చర్చించారు. దొంగతనం & స్నాచింగ్‌ లకు పాల్పడి తమ ఖర్చులను నడపాలని ఇద్దరూ ప్లాన్ చేసుకున్నారు. అక్కడ నీలం శ్రీనివాస్ కూడా దొంగిలించిన మొత్తాన్ని షేర్ మార్కెట్‌ లో పెట్టుబడి పెట్టి లాభాలతో డబ్బు సంపాదించాలని ప్లాన్ చేశాడు.


కరీంనగర్ జిల్లా జోగయ్య పల్లి కి చెందిన జ్యోతిష్యుడు చేల్ పూరి పెద్ద స్వామి నీ హత్య చేయడానికి పథకం పన్నారు కోనేటి జ్ఞానేశ్వర్, నీలం శ్రీనివాస్. స్వామీజీ కి సేవ చేస్తున్నట్టు నమ్మించి.. ఆశ్రమం లో మూడు రోజులు గడిపి అక్కడి వాతావరణాన్ని గమనించి హత్యా పథకం వేశారు.


స్వామీజీని హత్య చేసి 32 వేల నగదుతో పరార్..


ఈ ఏడాది మే 3 అర్ధరాత్రి సమయంలో.. స్వామీజీ నీ హత్య చేసి బంగారం, 32 వేల నగదుతో పరారు అయ్యారు. అంతటితో ఆగకుండా, చోరీ సొత్తు సరిపోక పోవడంతో షేర్ మార్కెట్ లో పెట్టుబడుల కోసం చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు నిందితులు. సూర్యాపేటలో బైక్ చోరీ చేసి.. ఏపీ, తెలంగాణలో స్నాచింగ్ లకు అలవాటు పడ్డారు.


వీరిపై రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కేసులు నమోదు అయ్యాయి. అయితే హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు వీరిని పట్టుకున్నారు. నిందితుల నుంచి 10.5 తులాల బంగారు అభరణాలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇద్దరికీ సహకరించిన మరో నిందితుడు విజయవాడకు చెందిన గంటా నాగబాబును రాజమండ్రి జైల్ లో ఉంచారు.