హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించడంతో మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. వర్షాకాలం వచ్చినందున అధికారులు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొంత కాలం క్రితం ప్రారంభించిన వార్డు కార్యాల‌యాల వ్యవ‌స్థపై మంత్రి కేటీఆర్ బుధ‌వారం (జూలై 5) సాయంత్రం స‌మీక్ష చేశారు. వర్షాకాలం వచ్చినందున అందరూ సిద్ధంగా ఉండాలని అధికారులను మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. 


వారాంతం నుంచి హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉందని, అంతర్గతంగా అన్ని విభాగాలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను ఎదుర్కొనేందుకు అందరూ సమన్వయంతో పని చేయాలని చెప్పారు. పారిశుద్ధ్యం పరంగా కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వాలని నిర్దేశించారు. పారిశుద్ధ్య కార్మికులతో సమావేశాలు పెట్టుకొని వారికి మార్గదర్శకాలు సూచించాలని చెప్పారు. వారి సేవలకు అభినందనలు తెలపాలని సూచించారు. నగర పారిశుద్ధ్యం పరంగా మరింతగా మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన దిశా నిర్దేశం చేయాలని సూచించారు.


నగరంలో ప్రజల నుంచి వస్తున్న స్పందనను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. సమస్యలపై వార్డు కార్యాలయాన్ని సందర్శించిన పలువురితో తాము స్వయంగా ఫోనులో మాట్లాడామని అధికారులు చెప్పారు. వార్డు కార్యాలయం వ్యవస్థ పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని తెలిపారు. వార్డు కార్యాలయాలను ప్రజల్లోకి మరింతగా తీసుకుపోయేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వెల్లడించారు. వార్డుల పరిధిలో ఉన్న కాలనీ సంక్షేమ సంఘాల భాగస్వామ్యంతో సంబంధిత కార్యక్రమాలు చేపట్టాలని వివరించారు. స్థానికంగా ఉన్న మహిళా సంఘాలు, ఇతర సంఘాల సహకారంతో కూడా వార్డు కార్యాలయ వ్యవస్థకు బాగా ప్రచారం కల్పించడానికి అవకాశం ఉంటుందని అన్నారు.